YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

నామస్మరణ

నామస్మరణ

కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞాలతో, ద్వాపరయుగంలో అర్చనలతో పరమాత్మ ప్రసన్నమయ్యేవాడంటారు. పరిమితమైన శారీరక, మానసిక శక్తులు కలిగిన కలియుగంలో ఆయన నామస్మరణతోనే ప్రీతి చెందుతాడని వేదపురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ యుగంలో మనుషులు బలహీనులు, అల్పాయుష్కులు, మందమతులు. మనసును దేనిమీదా స్థిరంగా నిలపలేరు. దేహం మీద ధ్యాస ఎక్కువ. ఇలాంటివారు తీవ్రంగా ధ్యాన యజ్ఞాదులు చేయలేరు. తీవ్ర తపస్సులు ఆచరించి తాపసులు కాలేరు. అందుకే మన మహర్షులు సులువైన మార్గంగా నామస్మరణను నిర్దేశించారు.
నిజానికి భగవంతుడు, ఆయన నామం వేరు కావు. ఉదాహరణకు కృష్ణుడి బరువుకు సరిపోయేట్లు సత్యభామ బంగారం, మణిమాణిక్యాలెన్నో వేసినా సరితూగలేదు. కాని- రుక్మిణి కృష్ణుడి నామాన్ని స్మరించి, ఒక తులసిదళంపై రాసి త్రాసులో వేసింది. అంతే... బరువు సరితూగింది. అదీ భగవంతుడి నామానికున్న శక్తి. ఆ విశ్వంభరుడికి సంబంధించిన ఏ విధమైన రూపాన్ని ఉద్దేశించిన నామమైనా, అది విశేషమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే ‘ఏ నామం జపించిన కొద్దీ అమృతమై, అతిశయమై అలరారుతుందో, ఏది ఉత్తమమైన ధర్మమార్గమో అదే భగవంతుడి నామ సంకీర్తనం’ అంటారు పోతనామాత్యులు శ్రీమద్భాగవతంలోని అజామిళోపాఖ్యానంలో!
ఆయన నామగుణ కీర్తనలు చేయటం రుచిస్తే, అప్పుడు ఇంద్రియ సంయమనం కోసం కూడా ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన పనిలేదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరుగురు శత్రువులు తమంతట తామే వశంలోకి వస్తారు. నిజానికి ఆ షట్‌రిపుల వల్లే మనకు అన్ని అనర్థాలు, ఆందోళనలు. ఆ అరిషడ్వర్గాలను నేరుగా ప్రతిఘటించి మనం విజయం సాధించలేం. దానికి సాధారణమైన మానవయత్నం సరిపోదు. దైవబలం కావాలి. సర్వేశ్వరుడి సహకారం అందాలి. అందుకే సర్వశక్తిమంతమైన ఆ పరంధాముడి నామమనే ఖడ్గాన్ని ధరించి దైర్యంగా యుద్ధానికి సన్నద్ధం కావచ్ఛు ఆ ఆరుగురిపై సునాయాసంగా విజయాన్నీ సాధించవచ్ఛు భక్త తులసీదాసు నుంచి భక్తరామదాసు వరకు ఎందరో భాగవతోత్తములు ఆ నామస్మరణతోనే అరిషడ్వర్గాలపై అదుపు సాధించగలిగారు. అత్యున్నతమైన ఆధ్యాత్మిక ఫలాలనూ సంప్రాప్తించుకున్నారు. అందుకే పదకవితా పితామహుడు అన్నమాచార్య కూడా ‘నీ నామమే మాకు నిధియు, నిధానము’ అంటారు ఓ కీర్తనలో ఆ శ్రీవేంకటేశ్వరుడిని స్తుతిస్తూ!
ప్రాపంచిక చింతనల్ని తగ్గించుకొని, ఆ పరాత్పరుడి పాదాలే శరణమనుకుంటూ నిరంతరం ఆయన నామసంకీర్తనలో సేదతీరాలి. అప్పుడు ఈ సాంసారిక జీవనానికి సంబంధించిన తరణోపాయాలన్నీ ఆ భగవంతుడే చూపెడతాడు. సులువుగా సంసారసాగరాన్ని దాటే నావ తన నామమేనని నిరూపిస్తాడు. సంత్‌ తుకారామ్‌, సతీ సక్కుబాయి ఆ మార్గంలోనే పయనించి పరమాత్మను పాండురంగడి రూపంలో ప్రసన్నం చేసుకున్నారు. పారలౌకిక పథానికి చేరుకున్నారు.
ఆయనను కీర్తిస్తున్న కొద్దీ మనోప్రవృత్తిలో మార్పు వస్తుంది. అది తమస్సు, రజస్సును దాటి సత్త్వగుణానికి చేరుకుంటుంది. అప్పుడు మన నడవడికలో ఉదాత్తత ప్రతిఫలిస్తుంది. అలా శ్రద్ధాభక్తులతో మనం చేసే భగవంతుడి గుణగానం ఒకానొకనాటికి సంపూర్ణ ఫలాన్నిస్తుంది. అందుకే రామకృష్ణ పరమహంస ‘కలియుగంలో మానవులు అన్నగత ప్రాణులు. ఆయుష్షు తక్కువ. దేహబుద్ధి, విషయబుద్ధి అడుగంటా నశించవు. అందుచేతనే భగవంతుడి నామాన్ని ఆశ్రయించాలి. భవబంధాల బాధల నుంచి బయటపడాలి. ఆ స్మరణతో ఆనందతీరానికి చేరుకోవాలి. ఆధ్యాత్మికోన్నతిని సాధించాలి’ అంటారు.

Related Posts