హైదరాబద్ జూలై 17
తెలంగాణ అద్భుతమైన పంటలు పండించే రాష్ట్రం. కానీ ఉమ్మడి పాలనలో పాలకుల నిర్లక్ష్యంతో కరంటు ఇవ్వక, సమయానుకూలంగా సాగునీరు అందివ్వక, వర్షాధారం క్రింద పంటలు ఎండిపోయి తెలంగాణ వ్యవసాయం దారుణంగా దెబ్బతిన్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక, కేవలం ఆరేళ్ళలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నామని అయన తెలిపారు. మామడ మండల కేంద్రం, కడెం మండలం బెల్లాల్ లో రైతు వేదికల నిర్మాణానికి శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. బెల్లాల్ లో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ,మార్కెట్, భూసారాన్ని అనుసరించి పంటలు సాగు చేస్తే రైతులకు లాభం ఉంటుందని, అందుకే నూతన వ్యవసాయ విధానాన్ని సీఎం కేసీఆర్ అమలుచేస్తున్నారని తెలిపారు. నియంత్రిత సాగు విధానంతో రైతులు ప్రయోజనాలు పొంది ఆర్థికంగా పరిపుష్టి చెందుతారన్నారు. రైతులు ఐక్యంగా ఉండేందుకు వేదికలు దోహదం చేస్తాయన్నారు.రైతులకు సహాయపడటానికి, అసంఘటిత రైతు శక్తిని సంఘటితం చేయడానికి రైతుబంధు సమితుల ఏర్పాటు చేయడం జరిగిందని, దానికి తోడు రైతు వేదికలను కూడా నిర్మిస్తున్నామన్నారు. విత్తనం వేసిన దగ్గర నుండి పండిన పంటను అమ్ముకునే వరకు రైతు బంధు సమితి సభ్యులు రైతులకు సహాయపడతారని అయన వివరించారు.దేశంలో ఎవరూ చేయని విధంగా రైతుల అవసరాలు తీర్చేందుకు ముఖ్యమంత్రి పలు పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రెండు పంటలకు గానూ ఎకరానికి రూ. 10 వేలు అందిస్తున్నామన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా రైతుబంధు కోసం రూ.7 వేల కోట్లను మంజూరు చేశారని చెప్పారు. రైతులకు ముందస్తుగానే పెట్టుబడి డబ్బులు సమకూరడంతో పాటు ఎరువులను, విత్తనాలను అందించడంతో సకాలంలో పంటలను వేస్తున్నారని తెలిపారు.దురదష్టవశాత్తూ రైతు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉదేశ్యంతో రూ.5 లక్షల బీమా అందిస్తున్నామని, రైతు బీమా కోసం ప్రభుత్యమే రూ.1300 కోట్లు ప్రీమియం చెల్లిస్తుందని పేర్కొన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా గిట్టుబాటు ధర చెల్లించి పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. నిర్మల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వరి (రూ.275 కోట్లు), మొక్క జొన్నలు( రూ.225 కోట్లు) కొనుగోలు చేసి రూ. 500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.