విజయవాడ, జూలై 18,
ఎక్కడో అక్కడ. ఎపుడో ఒకపుడు వెనక వారు ముందుకు రావడం సహజం. ఎపుడూ వెనక ఉంటే వారికే పట్టుదల పెరుగుతుంది. ముందున్న వారికి కూడా ఓ దశలో బోర్ కొడుతుంది, అలసత్వం పెరుగుతుంది. అధికారంలోకి రావడంతోనో మరేమో కానీ వైసీపీ క్యాడర్లో కాసింత కసి తగ్గింది. తమ నాయకుడు ముఖ్యమంత్రి అయిపోయాడు కదా అని నిబ్బరమూ వచ్చేసింది. దాంతో వారిలో నెమ్మదితనం ఎక్కువైంది. అదే సమయంలో అధికారం ఆమడదూరం అని తెలిసినా ఆరాధ్య వేలుపు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పేరుతో కలపాలన్న ఆరాటం జనసైనికులలో ఎక్కువైంది. ఫలితంగా ఇపుడు సోషల్ మీడియాలో పవన్ జోరు ఎక్కువైంది. పవర్ స్టార్ అసలైన స్టామినాకు ఇదే నిదర్శనం అంటున్నారు.పవన్ కళ్యాణ్ కి ఇపుడు సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ట్విట్టర్ ఖాతాకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. తాజా సమాచారం ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ను అనుసరిస్తున్న వారి సంఖ్య అచ్చంగా నలభై లక్షలకు చేరింది. అదే సమయంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ట్విట్టర్ ఖాతాకు కేవలం 16 లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. అంటే జగన్ కంటే రెట్టింపు అనుచర బలం పవన్ కళ్యాణ్ కి దక్కినట్లు అయింది. ఆ విధంగా సోషల్ మీడియా ద్వారా పవన్ యువ సీఎం ని వెనక్కి నెట్టినట్లేనని అంటున్నారు.ఇక ఇదే అసలైన పోరు కాకపోయినా, ఇపుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రభావాన్ని ఎవరూ కాదనలేరన్నది నగ్న సత్యం. వైసీపీ కూడా నిన్నటి ఎన్నికల్లో కళ్ళు చెదిరే మెజారిటీని సొంతం చేసుకుంది అంటే అది సోషల్ మీడియా మహత్స్యమేనని చెప్పకతప్పదు. ఇపుడు జగన్ పార్టీకి చెందిన కార్యకర్తలు అనుచరులు కూడా ఆయన ట్వీట్లకు అంత ఉత్సాహంగా స్పందించలేదడానికి రుజువు ఈ తక్కువ ఫాలోయింగ్ అంటున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ అంటే ఊగిపోయే అభిమానులు, కార్యకర్తలు దండీగా ఉండడమే ఆయనకు ట్విట్టర్ లో పెరిగిన బలానికి ఉదాహరణ అంటున్నారు.ఇదే అసలు పోరు అని ఎవరూ అనరు, ఇదే జనాదరణ అని కూడా చెప్పరు. కానీ వైసీపీలో సోషల్ మీడియా వింగ్ నీరసంగా ఉందని అనడానికి మాత్రం దీన్ని ఉదహరిస్తున్నారు. వైసీపీకి ఒక విధమైన హెచ్చరికగా దీనిని చూస్తున్నారు. ఆరేళ్ళుగా ప్రధానిగా ఉన్న మోడీ ట్విట్టర్ లో అగ్రభాగానే కొనసాగుతున్నారు. మరి ఏడాదికే జగన్ ఫాలోవర్స్ అనుకున్న స్థాయిలో పెరగకపోవడానికి కారణాలు ఏంటన్నది ఆలోచించాలి. నాయకుడి ఆలోచనలు అంత హుషార్ ని రేకెత్తించలేకపోతున్నాయా అన్నది కూడా చూడాలి, ఇక పవన్ కళ్యాణ్ కేవలం జనసేనాని మాత్రమే కాదు, టాప్ రేంజి సినిమా హీరో, ఆయన ఫాలోయింగ్ ఎక్కడా తగ్గలేదనడానికి దీన్ని ఆ పార్టీ గట్టిగా చెప్పుకుంటోంది. ఇకనైనా వైసీపీ సోషల్ మీడియా వింగ్ బలపడాలన్న సంకేతాన్నీ ఇస్తోంది. ఇదిలా ఉండగా తన ఆలోచనలు నచ్చి అనుసరిస్తున్న ట్విట్టర్ ఫాలోవర్స్ కి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు చెబుతూ ఇదే స్పూర్తిని కొనసాగించాలని కోరుకున్నారు. మొత్తానికి ట్విట్టర్ వీరుడుగా పవన్ కళ్యాణ్ జగన్ని గెలిచారు.