విజయవాడ, జూలై 18,
తాజాగా వెలుగు చూసిన ఆసక్తికర విషయం వైసీపీలో హల్‌చల్ చేస్తోంది. సీఎంగా జగన్ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో కొన్ని సంచలన నిర్ణయాలు, అంశాలు కూడా ఉంటున్నాయి. ప్రధానంగా దిశ పోలీసు స్టేషన్లు, పాఠశాలల ఆధునీకరణ సహా.. మహిళలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. అయితే, నిజానికి ఇప్పటి వరకు జరిగిన ప్రచారం ఏంటంటే.. ఆయా అంశాలన్నీ కూడా జగన్ తన పాదయాత్ర సమయంలో నేరుగా పరిశీలించి.. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలని, వాటిని మేనిఫెస్టోలో చేర్చారని. ఆ వెంటనే అధికారంలోకి రాగానే ఆయన వీటిని అమలు చేయడం ప్రారంభించారని. కానీ, తాజాగా వెలుగు చూసిన విషయం ఏంటంటే.. ఈ నిర్ణయాల వెనుక ఆయన సతీమణి భారతి సూచనలున్నాయని.నమ్మేందుకు ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో నేరుగా జోక్యం చేసుకునే వెలుసుబాటు సీఎంల సతీమణులకు లేకపోయినా.. తెరవెనుక అనేక మంది సీఎంలను నడిపించిన చరిత్ర ఉంది. గతంలో ఎన్టీఆర్‌ను లక్ష్మీపార్వతి నడిపించారనే వ్యాఖ్యలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. అదేవిధంగా టీడీపీ గత ఐదేళ్ల హయాంలోనూ చేసిన కొన్ని పనుల వెనుక ముఖ్యంగా పేద వర్గాలకు చెందిన విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేలా ప్రభుత్వం ప్రోత్సహించడం వెనుక అప్పటి సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాత్ర ఉందని అప్పట్లో మీడియా ప్రచారం చేసింది.ఈ తరహా పరిణామం.. తెలంగాణలోనూ మనకు కనిపిస్తుంది. అక్కడి సీఎం కేసీఆర్ కూడా సతీమణి శోభ సూచనలు పాటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆమె సూచన, కోరిక మేరకే ఆయన సీఎం హోదాలోనే అనేక యాగాలు నిర్వహించారు. నిజానికి యాదాద్రిని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలనే ప్లాన్ వెనుక కూడా శోభ ఉందని అంటారు.అయితే, సీఎంల సతీమణులు ఎవరూ కూడా మీడియా ముందుకు రారు. అంతా కూడా తెరచాటునే సలహాలు , సూచనలు చేస్తుంటారు.అలాగే ఇప్పుడు జగన్‌కు కూడా ఆయన సతీమణి, వ్యాపార వేత్త భారతి కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారని, ఆమె సూచనల మేరకే పేదలకు ఇంగ్లీషు మీడియం విద్యను అందించాలనే సంకల్పం చేసుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి ప్రజలకు మంచి చేసే క్రమంలో భర్తకు బాసటగా నిలుస్తున్న భారతికి జై కొట్టాల్సిందే అంటున్నారు పార్టీ నాయకులు. అదే సమయంలో ఆమె వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయన్న టాక్ కూడా వైసీపీ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతోంది.