ముంబై, జూలై 18,
కరోనా వైరస్ విస్తరణ కారణంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ల సంస్కృతి పూర్తిగా అంతరించిపోయినట్లేనని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాతా, నటుడు శేఖర్ కపూర్ తేల్చి చెప్పారు. ఎందుకంటే ఈ ఏడాది కాదు కదా... వచ్చే సంవత్సరం వరకు దేశంలో ఎక్కడా థియేటర్లు రీ ఓపెన్ అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు.
ఈ కారణం వల్లే స్టార్ హీరోల సిస్టమ్ ఇక పూర్తిగా నశించిపోయినట్లేనని చెప్పుకోవాలి. అంతకు మించి మా సినిమా మొదటివార్ంలోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిందనే అతిశయపు మాటలు ఇక వినపడవని శేఖర్ కపూర్ సోషల్ మీడియా ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిణామాలను గమనించండి. 2020 మార్చి నుండి సినిమాల మొదటి వారం వ్యాపారం గురించి ఎవరూ ఊసెత్తలేదు. పైగా మరో ఏడాది వరకు సినిమాలు థియేటర్లో విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నిజానికి ఆ అవకాశం కనుచూపు మేరలో కూడా లేదు. అందుకే స్టార్స్ మాత్రమే కాదు ఎవరైనా సరే తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసుకోవడానికి రెడీ అయిపోవాలి. సొంత యాప్‌లతో వాళ్లు సిద్ధంగా ఉండాలి. ఇవాళ టెక్నాలజీ అంతా మన చేతుల్లోనే ఉంది అని తేల్చి చెప్పారు శేఖర్ కపూర్. ఇప్పటికే అక్షయ్ కుమార్ (‘లక్ష్మీ బాంబ్’), అజయ్ దేవగన్ (భూజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా) వంటి స్టార్స్ చిత్రాలు ఓటీటీలో విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో శేఖర్ కపూర్ చెబుతున్నట్లుగా భవిష్యత్తులో సినిమా బాక్సాఫీస్ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లను చూసే అవకాశం సందేహాస్పదంగా మారుతోంది. దీనికి సమాధానం కూడా కాలమే చెప్పాలి.భారతీయ చిత్రపరిశ్రమలో ప్రధానంగా బాలీవుడ్‌లో స్టార్ సిస్టమ్ నశించిపోయినట్లేనని శేఖర్ కపూర్ ఊరికే అనలేదు మరి. భారీ బడ్జెట్‌తో తీసిన స్పోర్ట్స్ డ్రామా 83, మరో యాక్షన్ థ్రిల్లర్ సూర్యవంశి సినిమాల విడుదల ఇప్పటికే వాయిదా పడింది. ఇక దిల్ బచారా, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ సినిమాలు కూడా థియేటర్లవైపు చూడటం మాని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను వెదుక్కుంటున్నాయి. అందుకే ఇంతకాలం స్టార్లుగా వెలుగు వెలిగిన వారు ఇకనుంచి ఓటీటీ ప్లాట్‌పామ్‌కు లేదా తమ సొంత యాప్‌ల ద్వారా స్ట్రీమ్ ఫిల్మ్‌లకు వెళ్లవలసిందేనని, దానికి వీలిచ్చే టెక్నాలజీ కూడా చాలా సింపుల్‌గా మారిపోయిందని శేఖర్ కపూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.తెలుగులో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమా కూడా ఆగస్టు రెండోవారంలో ఓటీటీలో విడుదల కానుందని వార్తలువస్తున్నాయి. సినిమా నిర్మాణ ఖర్చులు, వడ్డీల భారం తట్టుకోలేని వారు క్రమంగా ఓటీటీల వైపు చూడకతప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరో నాలుగైదు నెలలు థియేటర్లలో సినిమాలు విడుదల కాకపోతే సినిమా బడ్జెట్ కూడా గణనీయంగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు సొంత ఓటీటీలో నెలకు రెండు మూడు సినిమాలు విడుదల చేస్తూ లాభాలు ఆర్జిస్తున్న రామ్ గోపాల్ వర్మ థియేటర్లు లేని ప్రపంచంలో సినిమాలు ఎలా తీయాలో, ఎలా బిజినెస్ చేసుకోవాలో యావత్ టాలీవుడ్‌కే పాఠాలు నేర్పుతున్నాడు మరి.