YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

ఆరోగ్య సేతు.. సూపర్ రికార్డ్

ఆరోగ్య సేతు.. సూపర్ రికార్డ్

న్యూఢిల్లీ, జూలై 18, 
క‌రోనా ర‌క్క‌సి బారి నుంచి కాపాడుకునేందుకు సాయం చేసే ఆరోగ్య సేతు యాప్ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించింది. ఏప్రిల్‌ నెలలో 8 కోట్లమంది ప్రజలు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోగా, ఆ సంఖ్య జూలై నాటికి 127.6 మిలియ‌న్లకు అంటే దాదాపుగా 13 కోట్లకు చేరుకుంది. దీనితో ఆరోగ్యసేతు ప్ర‌పంచంలోనే అధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న కోవిడ్ ట్రాకింగ్ యాప్‌గా నిలిచింది. క‌రోనా తాజా స‌మాచారంతోపాటు, వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లను అందిస్తూ, చుట్టుప‌క్క‌ల క‌రోనా రోగులుంటే అల‌ర్ట్ చేస్తుంది ఆరోగ్య సేతు.
కేంద్రప్రభుత్వం రూపొందించిన ఈ యాప్‌ని ఏప్రిల్‌ 1వ తేదీన విడుదల చేయగా కేవలం 13 రోజుల్లోనే 50 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఏప్రిల్‌ 28 నాటికి ఈ సంఖ్య 75 మిలియన్లు దాటింది. మే 6 వరకు ఈ సంఖ్య 90 మిలియన్లను అధిగమించింది. జూలైలో 127 మిలియ‌న్ల మైలురాయిని దాటేసింది. అయితే జ‌నాభా ప‌రంగా ఈ యాప్ వినియోగంలో భార‌త్‌ నాల్గ‌వ స్థానంలో ఉంద‌ని అంత‌ర్జాతీయంగా యాప్‌ల డౌన్‌లోడ్స్‌, వాటి ర్యాంకింగ్‌లను విశ్లేషించే సెన్సర్‌ టవర్‌ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఆరోగ్య సేతును దేశ జనాభాలో 12.5 శాతం మంది మాత్ర‌మే వినియోగిస్తుండ‌టంతో భార‌త్ 4వ స్థానానికే ప‌రిమిత‌మైంద‌ని తెలిపింది.
ఆస్ట్రేలియాలో కోవిడ్ భ‌ద్ర‌త కోసం ప్రవేశ‌పెట్టిన 'కోవిడ్ సేఫ్‌' యాప్‌ను అక్క‌డి 21 శాతం జ‌నాభా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగిస్తున్నార‌ని పేర్కొంది. దీంతో కోవిడ్ ట్రాకింగ్ యాప్‌కు అత్య‌ధిక ఆద‌ర‌ణ క‌లిగిన దేశంగా ఆస్ట్రేలియా ప్ర‌థ‌మ స్థానంలో ఉంది. కాగా భార‌త్‌లోని కొన్ని రాష్ట్రాలు ఆరోగ్య సేతు వంటి ఇత‌ర యాప్‌ల‌ను వృద్ధి చేయ‌డంతో అక్క‌డి జ‌నాభా స్థానిక యాప్‌ల‌ను వినియోగిస్తోంది. ఇది ప్రధానంగా ఆరోగ్య సేతు డౌన్‌లోడ్ల సంఖ్య‌ను, వినియోగాన్ని ప్ర‌భావితం చేస్తోంది.
దేశ, విదేశాల్లోని కరోనా కేసుల సమాచారం, మిమ్మల్ని మీరు కరోనా బారి నుంచి ఎలా కాపాడుకోవాలి? మీ నుంచి కరోనా పాజిటివ్‌ పేషెంట్లు 500 మీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు ఎంతమంది ఉన్నారో గుర్తించి మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. కేవలం 3.7 ఎంబీ కలిగిన ఈ యాప్‌ను జూమ్, టిక్‌–టాక్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారని అంతర్జాతీయంగా యాప్‌ల డౌన్‌ లోడ్స్, వాటి ర్యాంకింగ్‌లను విశ్లేషించే సెన్సర్‌ టవర్‌ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. సరిగ్గా మూడు నెలలలోపే ఈ యాప్ అధిక డౌన్ లోడ్ల విషయంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సంస్థ ఆరోగ్య సేతు యాప్‌ను అభివృద్ధి చేసింది. జీపీఎస్, బ్లూటూత్‌లో రూపొందించిన ఈ కరోనాట్రాకింగ్‌ యాప్‌ని ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఫోన్లకు అనుగుణంగా తీర్చిదిద్దారు. భారతీ యులను కరోనా నుంచి ఆరోగ్యం దిశగా పయనింపజేసేందుకు ఉద్దేశించిన వారధి ఈ యాప్‌.. అందుకే, దీనికి ఆరోగ్య సేతు అని పేరు పెట్టారు.12 భాషల్లో అందుబాటులో ఉండటం వల్ల దేశంలోని మెజారిటీ ప్రజలకు ఈ యాప్‌ దగ్గరైంది. ప్రధాని మోదీ కూడా ఈ యాప్‌ని వినియోగించాలని ప్రజల్లో అవగాహన కల్పించారు. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఏ యాప్‌ కూడా ఇంతవేగంగా ఇన్ని మిలియన్ల డౌన్‌లోడ్‌లను సాధించలేదు. అందులోనూ ఇది ఒక దేశీయ యాప్‌ కావడం గమనార్హం. దీని కంటే ముందున్న యాప్‌లన్నీ కేవలం వినోదం, సమాచార యాప్‌లు కాగా.. ఇదొక్కటే ఆరోగ్యానికి సంబంధించినది.కరోనా తాజా సమాచారంతో పాటుగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, కేంద్రం అనుసరిస్తున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలను అందించే ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కాలంలో మినహాయింపు రంగాలతో పాటు లాక్‌డౌన్‌ తర్వాత పనిచేసే అన్ని రంగాల్లో ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరి చేయాలని భావిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత పలు రకాల ప్రశ్నలకు అందులో సమాధానాలు ఎంట్రీ చేయాలి. కరోనా వైరస్‌ వ్యాప్తి, సంబంధీకులతో మనం కనెక్ట్‌ అయ్యామా? విదేశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చామా, కరోనా వైరస్‌ సోకే లక్షణాలేమైనా ఉన్నాయా అనే రీతిలో ప్రశ్నలకు జవాబులు రాయాలి. వీటి ఆధారంగా మన ఆరోగ్య పరిస్థితి ఈ యాప్‌లో రికార్డవుతుంది. కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ఈయాప్‌ సూచిస్తుంది. మన చుట్టుప్రక్కల ఎవరైనా కరోనా రోగులుంటే అలర్ట్‌ చేస్తుంది. ఇందుకు జీపీఎస్‌ను ఆన్‌లో ఉంచాలి. ప్రస్తుతం ఆరోగ్య వివరాలను ఒకసారి మాత్రమే ఎంట్రీ చేయాల్సి ఉండగా.. త్వరలో మరింత అప్‌డేట్‌ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో మన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంది. ప్రతి వ్యక్తిని పరిశీలించేందుకు బదులుగా..సాంకేతిక సాయంతో విశ్లేషించడానికి ఈ యాప్‌ దోహదపడుతుందని అధికారులు భావించి ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

Related Posts