విజయవాడ, జూలై 18
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ విస్తరణకు సిద్ధమవుతున్నారు. ఇందుకు గానూ ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన ఏపీ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆషాడ మాసం కాబట్టి 21వ తేదీన ఆషాడం పోయి శ్రావణ మాసం రాగానే 22న క్యాబినెట్ విస్తరణ చేపట్టాలనే నిర్ణయం జరిగింది. వైసీపీకి అనుకూలంగా ఉండే పత్రికలోనే ఈ నెల 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని వార్త రావడంతో డేట్ ఫిక్స్ అయినట్లే అర్థం చేసుకోవాలి.ఏడాది క్రితం ఎన్నికల్లో గెలవగానే ఒకేసారి పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి జగన్. 151 సీట్లతో అధికారంలోకి రావడంతో మంత్రి పదవుల కోసం చాలా మంది ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. అయితే, విశ్వసనీయత, సామాజక న్యాయం, సమర్థత అనే మూడు అంశాలను చూసి మంత్రి పదవులు ఇచ్చారు జగన్. ఇందులో భాగంగా కష్టాల్లో తనతో పాటు వెంట నడిచి మంత్రి పదవులను కోల్పోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణకు మంత్రి పదవులు ఇచ్చారు జగన్.అయితే, రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ చేస్తామని జగన్ చెప్పారు. కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపించడంతో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. వీరిద్దరూ ఇటీవలే ఎమ్మెల్సీ పదవులకు, మంత్రి పదవులకు రాజీనామా కూడా చేసేశారు. దీంతో వీరి స్థానంలో జగన్ 22న ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రెండు పదవుల కోసం చాలా మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు.అయితే, సామాజికన్యాయానికి పెద్ద పీట వేస్తున్న జగన్ ఈ రెండు పదవులను బీసీలతో భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పైగా సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ సామాజకవర్గాలకు చెందిన వారితోనే వీరి స్థానాలను భర్తీ చేయాలని భావిస్తున్నారు. తద్వారా ఆయా సామాజిక వర్గాల వారు మంత్రివర్గంలో ఉండేలా చూడాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్‌ది శెట్టి బలిజ సామాజికవర్గం కాగా మోపిదేవి వెంకటరమణ మత్య్సకార సామాజికవర్గానికి చెందిన వారు.దీంతో ఇప్పుడు ఈ రెండు సామాజకవర్గాలకు చెందిన నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఈ సామాజకవర్గాల నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లేకపోవడంతో పోటీ తక్కువగానే ఉంది. మత్య్సకార సామాజికవర్గం విషయానికి వస్తే రాష్ట్రంలో ఆ సామాజికవర్గం నుంచి తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పల్రాజు మాత్రమే ఉన్నారు. వీరిద్దరూ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, పొన్నాడ సతీష్ రెండోసారి ఎమ్మెల్యే కావడం, అప్పల్రాజు మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో పొన్నాడకే ఎక్కువగా అవకాశాలు ఉండవచ్చు.మంత్రి పదవి వదులుకున్న సుభాష్ చంద్రబోస్‌ది శెట్టి బలిజ సామాజికవర్గం. తూర్పు గోదావరి జిల్లా. ఒకవేళ అదే సామాజికవర్గం నుంచి, అదే జిల్లా నుంచి ఆయన స్థానాన్ని భర్తీ చేయాలంటే రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్‌కు అవకాశం లభించవచ్చు. అప్పుడు ఇదే జిల్లాకు చెందిన పొన్నాడ సతీష్‌కు ఛాన్స్ దొరకడం కష్టం.ఇదే జరిగితే పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పల్రాజుకు మంత్రివర్గంలో అవకాశం దొరకవచ్చు. ఇలా రెండు మంత్రిపదవుల కోసం ముగ్గురు ఎమ్మెల్యేల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఈ ముగ్గురిలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కడం ఖాయంగా చెబుతున్నారు. మరి, ఈ ముగ్గురిలో ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయో వేచి చూడాల్సి ఉంది.