YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సిండికేట్ గా మారుతున్న మద్యం వ్యాపారులు

సిండికేట్ గా మారుతున్న మద్యం వ్యాపారులు

హైద్రాబాద్, జూలై 18, 
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు, స్టార్‌ హోటళ్ల నిర్వాహకులు సిండికేట్‌గా మారి నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాలను ఫణంగా పెట్టి ప్రభుత్వమే రాత్రి 11 గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతులివ్వడంతో.. ఇక నిర్వాహకుల ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. ఎక్సైజ్‌, పోలీస్‌ నిబంధనలు మాకు కాదులే అనే తీరులో వ్యవహరిస్తున్నారు. గ్రేటర్‌లో 420 వైన్స్‌షాపులు, 196 వరకు బార్లున్నాయి. వీటిల్లో చాలా మేరకు పార్కింగ్‌ స్థలాలు లేవు. అర్ధరాత్రి వరకు మందుబాబుల సందడి కొనసాగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఫూటుగా మద్యం సేవించి రోడ్లపై తన్నుకుంటున్నారు. మైనర్లు, మందుబాబులు విందులు, వినోదాల పేరుతో చిందులేస్తున్నారు.ఎక్సైజ్‌ నియమ, నిబంధనలు వైన్స్‌లు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు కచ్చితంగా పాటించాలి. దేవాలయాలు, విద్యాసంస్థలు, నివాసగృహాలు, రహదారులకు దూరంగా ఉండాలి. ఫైర్‌సేఫ్టీలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలం కేటాయించాలి. బార్‌లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో తెలిసే విధంగా ప్రవేశద్వారాలు, పార్కింగ్‌ ప్రాంతాల్లో భద్రత సిబ్బందితోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. లోపల కూడా సీసీ కెమెరాలు ఉండాలి. ఆ ఫుటేజీలను నెల రోజులపాటు భద్రపరిచే హార్డ్‌డిస్క్‌లు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో బార్లలో 11:30 తర్వాత మద్యం సరఫరా చేయకూడదని, ఆహార పదార్థాలు మాత్రం సరఫరా చేసుకోవచ్చని ఆబ్కారీ శాఖ ఆదేశాలిచ్చింది. వైన్స్‌లో మద్యం ధరలను స్పష్టంగా తెలిపే విధంగా సూచిక బోర్డులు అమర్చాలి. అయినా చాలామంది నిర్వాహకులు అవేమీ పాటించడం లేదు. నగరం, శివారు ప్రాంతాల్లోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పబ్బుల్లో సీసీ కెమెరాలు అవసరమున్న చోట ఉండటం లేదు.వైన్స్‌లు, పబ్బులు, బార్లలో మైనర్లకు మద్యం సరఫరా చేయకూడదన్న నిబంధనలను 90 శాతం యాజమాన్యాలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్‌ చట్టం ప్రకారం 21 ఏండ్లున్న వారికే మద్యం సరఫరా చేయాలి. కానీ అది అమలు కావడం లేదు. మద్యం సరఫరా చేసేటప్పుడు వీరి వయస్సు ధ్రువీకరణ పత్రం బార్లు, పబ్బుల్లో చూపించాలి. మద్యం తాగేందుకు వచ్చిన మైనర్లు, విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు చూపించడం లేదు. యజమానులు కూడా అడగడం లేదు. మరోవైపు మైనర్లను ఆకర్షించేందుకు జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌లోని కొన్ని పబ్బులు విద్యార్థులకు రాయితీలు ప్రకటిస్తున్నాయి. జన్మదిన వేడుకలు, కళాశాలల వీడ్కోలు ఉత్సవాలను తమ వద్ద చేసుకోవాలంటూ చెబుతున్నాయి. వీటన్నింటికి తోడు రాత్రి సమయాల్లో తనిఖీలు లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తప్పతాగిన మైనర్లు వాహనాలను నడుపుతూ రహదారులపైకి వస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలకు వస్తున్నప్పుడు మాత్రం నిర్వాహకులు కాస్త హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత షరా మామూలుగానే వ్యవహరిస్తున్నారు.పీకల దాకా మద్యం సేవిస్తున్న కొందరు రోడ్లపైనే గ్యాంగ్‌వార్‌లకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో మాటా మాటా పెరిగి దాడులు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల కత్తులతో పొడుచుకున్న ఘటనలూ ఉన్నాయి. రోడ్లపై కనిపించిన వారిని చితకబాదుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా పాతబస్తీ, టోలీచౌకీ, మెహిదీపట్నం, ఎస్‌ఆర్‌నగర్‌, ఎల్బీనగర్‌, విద్యానగర్‌, లాలాపేట్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాలల్లో జరుగుతున్నాయి. కొద్దిరోజుల కిందట బంజారాహిల్స్‌లోని సింగాడిగుంట బస్తీలో కారు, రెండు ఆటోలు, మూడు బైకులను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మద్యం సేవించిన మహమూద్‌ అలీ, వెంకటేశ్‌ అనే యువకులు బృందాలుగా ఏర్పడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. పీటర్‌ అనే యువకుడి కారు అద్దాలను బండలతో కొట్టారు. శ్రవణ్‌ అనే వ్యక్తి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా డబ్బులివ్వాలని బెదిరించారు. రోడ్డుపై వెళ్తున్న మహిళలను బండ బూతులు తిట్టారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ఎక్సైజ్‌, పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Related Posts