వ్యాకరణానికి శబ్దశాస్త్రం అని ప్రసిద్ధి. శబ్ద శాస్త్రానికి మూలం మహేశ్వరుడు. కైలాసపర్వతంపై ప్రమథ గణాలు కొలుస్తుండగా పరమేశ్వరుడు ప్రతినిత్యం సాయంకాల సంధ్యావేళల్లో పరమేశ్వరితో కలిసి తాండవనృత్యం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. లయకారకుడైన పరమేశ్వరుడు అనంతమైన వాఙ్మయానికి మూలమైన అక్షరాలకు సృష్టికర్త. ఆయన ఢక్కానాదం నుంచి వెలువడిన అక్షరాలే మహేశ్వర సూత్రాలుగా జగత్ప్రసిద్ధిని పొందాయి. పద్నాలుగు సూత్రాల రూపంలో ఉన్న ఆ అక్షర సముదాయమే సమస్త వ్యాకరణ శాస్త్రాలకు ఆయువుపట్టు. వాటిని ఆధారంగా చేసుకొని ఎన్నో వ్యాకరణాలు లోకంలో పుట్టాయి. ‘అష్టాధ్యాయి’ అనే వ్యాకరణ శాస్త్రాన్ని రచించడానికి ముందు పాణిని మహర్షి హిమాలయాల్లో పరమేశ్వరుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడని, అతడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఆనంద తాండవనృత్యం చేశాడని, ఆ సమయంలో శివుడి చేతిలో మోగిన ఢక్కానాదాల నుంచి వెలువడిన ‘అఇఉణ్’ మొదలైన పద్నాలుగు సూత్రాలు పాణిని మహర్షి చెవిన పడ్డాయని, వాటిని ఆధారంగా చేసుకొని ఆయన వ్యాకరణ శాస్త్రాన్ని రచించి లోకానికి అందించాడని ఐతిహ్యం.
ఈ ప్రపంచం గాఢాంధకారంలో మునిగిపోకుండా కాపాడుతున్నది శబ్దమే. శబ్దం అనేది జ్యోతి వంటిది. అది వెలగకపోతే ప్రపంచం అంతా నిశ్శబ్దంగా మారిపోతుందన్నది దండిమహాకవి మాట. మనుషులు తమ నిత్యజీవితంలో ఒకరికొకరు అభిప్రాయ వినిమయం చేసుకోవడానికి మాటలే కదా ఆలంబనలు? మాటలు లేకుండా మనుగడ సాధ్యమా? మాటలు స్పష్టంగా, నిర్దుష్టంగా ఉంటేనే ఇతరులకు మనోభావాలు తెలుస్తాయి. అర్థాన్ని అనుసరించి ఉండే పదాలను ఉచ్చరిస్తేనే ఎదుటివారికి భావం బోధపడుతుందనేది సత్యం. అకారాది వర్ణమాలలో ఉండే అక్షరాలను భావస్ఫోరకంగా పదాలుగా కూర్చుకొంటేనే భావం అర్థమవుతుంది.
ఒక్కసారి నామవాచకాలను పరిశీలిస్తే శబ్దానికి ఉండే విశిష్టత తెలుస్తుంది. సూర్యుడికి తపనుడు అనే పేరుంది. తన వేడికిరణాలతో లోకాన్ని తపింపజేస్తాడు కనుక ఆ పేరు సూర్యుడికి సార్థకం. జాబిల్లికి చంద్రుడనే పేరుంది. తన చల్లని కిరణాలతో ఆహ్లాదపరచేవాడు కనుక ఆ పేరు అన్వర్థమైంది. ఇలా గుణాన్ని బట్టి, స్వభావాలను బట్టి పేర్లు ఉంటాయి. ఇదంతా శబ్దానికి గల ప్రత్యేకత.
శబ్దాలకు శక్తి ఉంటుందని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. వేదమంత్రాలను చక్కగా స్వరానుగుణంగా పఠించకపోతే వాటి వాటి అర్థాలు మారిపోతాయని వేదాంగం అయిన శిక్షాశాస్త్రం చెబుతోంది.
అ, ఉ, మ అనే బీజాక్షరాలతో సమ్మిళతమైన ప్రణవనాదం ఓంకారంలో అమిత తేజస్సు ఉంటుందని సాధకులు చెబుతారు. ప్రణవాన్ని ఉచ్చరిస్తున్నంతసేపు మానవశరీరంలోని అన్ని అవయవాలూ చక్కగా పనిచేస్తాయని, ఆహ్లాదానికి గురవుతాయని మహర్షుల ఉపదేశం. సకల వేదాలు, సకల తపస్సులు, సకల వ్రతాలు... చివరికి చేరేది ప్రణవనాదంలోనికే అని కఠోపనిషత్తు చెబుతోంది.
పసితనంలో పాఠశాలలో పిల్లలు నేర్చుకొనే వర్ణమాల మాహేశ్వర సూత్రాలనుంచే లభించింది. అందుకే అక్షరాభ్యాస సమయంలో ‘ఓం నమః శివాయ’ అని పలకలపై రాయడం, ఆ అక్షరాలను పిల్లలతో పలికించడం, రాయించడం సంప్రదాయంగా వస్తోంది.
కాళిదాసమహాకవి రఘువంశమహా కావ్యారంభంలో పార్వతీదేవి వాక్కుకు ప్రతీక అని, పరమేశ్వరుడు అర్థానికి ప్రతిరూపుడని వర్ణించాడు. వాగర్థాల కలయిక అయిన భాష ఆదిదంపతుల జ్ఞానభిక్ష! అందుకే అక్షరాలన్నీ మాహేశ్వర సూత్రాలే!!