YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

త్రికాలములలో శ్రీరాముని ధ్యాన శ్లోకములు

త్రికాలములలో శ్రీరాముని ధ్యాన శ్లోకములు

శ్రీరామ కర్ణామృతమునుండి
ధ్యాయే ప్రాతస్సురేశం రవికులతిలకం రంజితానంతలోకం
బాలం బాలారుణాక్షం భవముఖవినుతం భావగమ్యం భవఘ్నమ్,
దీప్యంతం స్వర్ణక్లప్తై ర్మణిగణనికరై ర్భూషణై రుజ్జ్వలాంగం
కౌసల్యాదేహజాతం మమ హృదయగతం రామ మీషత్ స్మితాస్యమ్.
దేవతల కధిపతియైనవాడు , సూర్యవంశశ్రేష్ఠుడు , ఎల్లలోకాలనూ ఆనందింపజేయువాడు, బాలుడు, లేతసూర్యుని పోలిన ఎఱ్ఱనైన నేత్రములు గలిగినవాడు, శివాదులచే స్తోత్రము చేయబడువాడు, హృదయమందు ధ్యానింపదగినవాడు, సంసారబాధను పోగొట్టువాడు, శ్రేష్ఠుడు, మణులు పొదగబడిన కనకాభరణములచే ప్రకాశించువాడు , కౌసల్య కుమారుడు, నా హృదయందున్నవాడు , చిఱునవ్వుమోమువాడు అయిన రాముని ప్రాతఃకాలమందు ధ్యానము చేయుచున్నాను.
మధ్యాహ్నే రామచంద్రం మణిగణలలితం మందహాసావలోకం
మార్తాండానేకభాసం మరకతనికరాకార మానందమూర్తిమ్,
సీతావామాంకసంస్థం సరసిజనయనం పీతవాసో వసానం
వందేఽహం వాసుదేవం వరశరధనుషం మానసే మే విభాంతమ్.
మాణిక్యసమూహముచే సుందరుడు, చూపులతో చిరునవ్వులు చిందించువాడు, బహుసూర్యుల కాంతిగలిగిన వాడు, మరకత మణుల ప్రోగువంటి ఆకారము గలిగినవాడు, ఆనందస్వరూపుడు, ఎడమతొడపై సీత ఉన్నవాడు, పద్మములవంటి నేత్రములు కలిగినవాడు , పచ్చని వస్త్రమును ధరించినవాడు, అన్ని లోకములకు నివాసస్థానమైనవాడు, శ్రేష్ఠములైన ధనుర్బాణములు ధరించినవాడు, నా మనమున బ్రకాశించుచున్నవాడు అగు రామచంద్రుని మధ్యాహ్నమున నమస్కరించుచున్నాను.
ధ్యాయే రామం సుధాంశుం నతసకలభవారణ్యతాపప్రహారం
శ్యామం శాంతం సురేంద్రం సురమునివినతం కోటిసూర్యప్రకాశమ్,
సీతసౌమిత్రిసేవ్యం సురనరసుగమం దివ్యసింహాసనస్థం
సాయాహ్నే రామచంద్రం స్మితరుచిరముఖం సర్వదా మే ప్రసన్నమ్.
చంద్రుని వలె నుండువాడు, నమస్కరించువారికి సంసారారణ్యబాధ నంతయు హరించువాడు , నల్లనివాడు , శాంతుడు, దేవతలచే మునులచే నమస్కరింపబడువాడు, కోటి సూర్యుల కాంతి వంటి కాంతిగలిగినవాడు , సీతాలక్ష్మణులచే సేవింపబడుతున్నవాడు, దేవతలకు మనుష్యులకు సులభుడైనవాడు , గొప్పసింహాసనమందున్నవాడు , నవ్వుచే సుందరమైన మోముగల రామమూర్తి నెల్లపుడు సాయంకాలంమందు ధ్యానించుచున్నాను.
*శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారం* అని! వాల్మీకి రామాయణంలో రాముడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడని వర్ణన
1. బాలకాండలో, పరశురాముడు రాముని గురించి,
అక్షయం మధుహంతారం జానామి త్వాం సురోథ్థమమ్
రామా! నిను నాశనము లేనివానినిగాను, మధువను రాక్షసుని జంపినవానినిగను, దేవతలలో శ్రేష్టునిగాను కూడా యెరుగుదును.
2. అయోధ్యకాండలో సుమిత్ర రాముని గురించి -
దైవతం దేవతానాం చ భూతానాం భూతసత్తమ:
దేవతలకు కూడా దేవుడవు. భూతములకు కూడా శ్రేష్టమగు భూతమవు.
3. అరణ్యకాండలో శబరీ రాముని దేవవర (దేవతలలో శ్రేష్టుడు).
4. కిష్కిందకాండ లో తార రాముని గురించి
మనుష్య దేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్త:
మానవుల దేహములందలి సామాన్య తేజమును విడిచి, దివ్య దేహములందుమ్డు తేజమును ధరించి యున్నాడు.
5. సుందరకాండలో హనుమంతుడు రాముని .....
లోకత్రయనాయక............. లోకత్రయమునకు నాయకుడని ప్రశంసించెను.
6. యుద్దకాండలో మాల్యవంతుడు రాముని గురించి
విష్ణుం మన్యామహిదేవం మానుషం దేహ మాస్థితం
మనుష్య దేహమును స్వీకరించిన విష్ణు దేవునిగా తలచుచున్నాను.
7. రావణాసురుడు రాముని గురించి
తం మన్యే రాఘవం వీరం నారాయనంనామయం
రాఘవుడు అనామయుడైన నారాయణుడు అని తలచుచున్నాడు.
8. బ్రహ్మ దేవుడే రాముని గురించి
భవాన్నారాయనో దేవ: ......నీవు నారాయనుడవే అని ప్రశంసించెను
*ఇన్ని ప్రమాణాలను అనుసరించి రాముడు కేవలము నారాయణుడనే భోధపడుతున్నది ....
రామాయణంలోనే స్పష్టంగా చెప్పబడిన అనేక విషయాలు రాముడు మానవుడు కాదని.. స్వయం నారాయణుడని తేటతెల్లం చేస్తున్నాయి. భూదేవి, బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు, ఋషులు కలసి విష్ణుదేవుని కలసి పాపాత్ముడైన రావణుడి పీడ గురించి మొరపెట్టుకోగా.. తాను  కశ్యపుడైన దశరథుని బిడ్డగా వచ్చి రావణుడిని సంహరిస్తానని స్వయంగా చెప్పాడు విష్ణువు. బ్రహ్మగారిచ్చిన వరం కారణంగా నరవానరుల వల్ల మాత్రమే రావణ సంహారం జరుగుతుంది కనుక తాను నరుడిగా జన్మిస్తానని.. దేవతలందరూ వానరులుగా పుట్టాలని దిశానిర్దేశం చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆదేశాన్ని అందుకొని కోట్లాదిమంది దేవతలు తమ అంశాలతో వానరవీరుల్ని సృజించారని స్పష్టంగా ఉంది. బ్రహ్మ అంశతో జాంబవంతుడు, ఇంద్రుని అంశతో సుగ్రీవుడు.. ఇలా.
ఒకనాడు బ్రహ్మదేవుడు నారదుడికి విష్ణువు నరావతార గాధను వినిపిస్తాడు.. అప్పటికి ఇంకా రాముడు పుట్టలేదు. ఇది దైవరహస్యం కనుక గోప్యంగా ఉంచాలని ఆదేశిస్తాడు. అప్పుడా అమృత గాధను నారదుడు నట్టడవిలో తరులతలకు వినిపిస్తాడు.. అప్పటికి అదే అరణ్యంలో తపస్సులో ఉన్నముని పుట్ట వెనుకనుంచి దానిని లీలగా వింటాడు. ఆ తర్వాత అతడు వల్మీకం (పుట్ట)నుంచి బయటికి వస్తాడు అతడే వాల్మీకి. అందుకే అతడు అద్వితీయమైన సద్గుణాలున్న ఆ కథలోని మహాపురుషుడు ఎవరని అనేకమందిని ప్రశ్నించి చివరికి నారదుని ద్వారా ఆ మహాపురుషుడు నారాయణుడైన రాముడే అని తెలుసుకుంటాడు.
శ్రీరాముని దివ్య గాధను రామాయణంగా ఒక మహాకావ్యంగా రాయాలని అందుకే నారదుడు వాల్మీకికి ఉపదేశిస్తాడు. నిజ నారాయణతత్త్వం ఈ రచనలో ఆవిష్కృతం కావాలి కనుకనే సప్తర్షులు, నారదుడు, బ్రహ్మదేవుడు.. ఇలా ఇంతమంది వాల్మీకిని రచనాసన్నద్ధుడ్ని గావించారు.
విశ్వామిత్రుడు, వసిష్ఠుడు అనేకసార్లు చాలా స్పష్టంగానే చెప్పారు రాముడు నరుడు కాదు నారాయణుడే అని. ఇంకా చెప్పాలంటే దశరథుని యాగ సమయంలోనే మంత్రి సుమంత్రుడు ఒక పూర్వగాథను వివరించాడు. అందులోనే సనత్కుమారునిచే రామావతార విశేషం చెప్పబడింది. అహల్య శాపవిమోచనఘట్టంలో రాముడు అవతారపురుషుడు అని చెప్పలేదా? శివధనుస్సుని రాముడు భంగపరిచిన ఘట్టం రాముడి దివ్యత్వాన్ని ఆవిష్కరించలేదా? పరశురాముడు ఆగ్రహంగా వచ్చి నారాయణ చాపాన్ని ఇచ్చి ఎక్కుపెట్టమన్నపుడు.. రాముడు ఎక్కుపెట్టిన తర్వాత పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు అర్థం కాలేదా రాముడు విష్ణువే అని? శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు మునులందరూ ముక్తకంఠంతో ఆయనను విష్ణుదేవునిగా సంభావించి స్తుతించారు. అయితే అవతార ధర్మం కనుక రాముడు మాత్రం తాను ఎలాంటి దైవాంశ లేని నరుడినే అని చెప్పుకున్నాడు. తాను నరుడ్ని అనే స్పృహ రాముడికి ఉండాలి.. నారాయణుడ్ని అనే సంగతి అయన మర్చిపోవాలి.. అలా ఉంటేనే రావణుడు ఆయన చేతిలో మరణిస్తాడు. ఇది రామాయణంలో అనేకసార్లు చెప్పిన బహిరంగ రహస్యం. అంటే రాముడికి మాత్రమే తాను నరుడ్ని అనే స్పృహ ఉండాలి.. అందుకే ఆయనకి ఉంది. ఇతరులందరికీ రాముడు దేవుడే అని తెలుసు. ఆ గౌరవాన్ని ఆయనకు ఇచ్చారు కూడా. జటాయువు, సంపాతి, హనుమ, విభీషణుడు ఇలా ఎందరెందరో రాముడిలోని దైవాంశను గ్రహించి సేవించి తరించారు.
రాముడు నరుడైతే సముద్రుడు బెదిరిపోయి వచ్చి చేతులు జోడిస్తాడా? రాముడు మానవమాత్రుడే అయితే ఇంద్రుడు తన రథాన్ని, సారథిని పంపిస్తాడా? రాముడు కేవలం మానవుడైతే అంతమంది ఋషులు ఆయన దర్శనం కోసం తపించి.. దర్శించగానే జన్మ ధన్యమైనదని మురిసిపోతారా?
రాముడు నరుడే అన్న భ్రమలు ఇంత రామాయణం చదివిన తర్వాత కూడా.. ఇంకా ఎక్కడ మనలో ఉండిపోతాయో అనే అనుమానంతోనే చివరి ఘట్టంలో సర్వదేవతలూ వచ్చారు.
 

Related Posts