YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశంలోనే ధనిక మహిళగా రోషిణీ నాడార్‌

దేశంలోనే ధనిక మహిళగా రోషిణీ నాడార్‌

బెంగళూర్, జూలై 18, 
భారత ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ‘హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్’ దేశ ప్రజలకు సర్‌ప్రైజింగ్ వార్తలను అందించింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ (75) ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగడం ఒక వార్త కాగా.. ఆ స్థానంలోకి ఆయన కుమార్తె రోషిణీ నాడార్‌ మల్హోత్రా (38) రావడం మరో వార్త. శుక్రవారం నుంచే ఆమె ఈ బాధ్యతల్లోకి వస్తున్నట్లు ప్రకటించడం మరో విశేషం.ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న రోషిణీ నాడార్‌కు దేశంలోనే అత్యంత ధనిక మహిళగా ఇప్పటికే గుర్తింపు ఉంది. 2019లో ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఆమె 54వ స్థానంలో నిలిచారు.రోషిణీ 2009లో హెచ్‌సీఎల్‌ అనుబంధ సంస్థ అయిన ‘హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌’ డైరెక్టర్ల బోర్డులో చేరారు. ఈ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ వ్యవహారాలను చూస్తుంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో ఎంట్రీ ఇచ్చిన నాలుగేళ్లకు (2013) ఆమె హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో అడిషినల్ డైరెక్టర్‌గా అడుగుపెట్టారు. అప్పటికే ఈ కంపెనీ దేశంలో సాఫ్ట్‌వేర్ ఎగుమతులు చేస్తున్న మూడో అతిపెద్ద సంస్థగా గుర్తింపు సాధించింది.దేశ రాజధాని ఢిల్లీలో రోషిణీ నాడార్ పుట్టి పెరిగారు. వసంత్ వ్యాలీ స్కూల్‌లో చదివారు. అమెరికాలోని ‘కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌’ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.శివ్ నాడార్ ఏకైక కుమార్తెగా కంపెనీకి సంబంధించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో రోషిణీ చురుగ్గా పాల్గొంటున్నారు. విద్యాజ్ఞాన్‌ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో వెనకబడిన పేద పిల్లలకు హెచ్‌సీఎల్‌ ఫౌండేషన్‌ ద్వారా విద్య అందిస్తున్నారు. వైల్డ్ లైఫ్ పట్ల ఆసక్తి కనబరిచే రోషిణీ నాడార్ వన్యప్రాణుల సంరక్షణ కోసం 2018లో హబిటాట్స్ ట్రస్ట్ ప్రారంభించారు. దీని ద్వారా దేశంలోని ప్రత్యేకమైన జంతువుల మనుగడకు చర్యలు తీసుకుంటున్నారు. సస్టెయినబుల్ ఎకోసిస్టమ్‌కు ప్రోత్సాహం అందిస్తూ కార్పొరేట్ బాధ్యతగా తన వంతు పాత్ర పోషిస్తున్నారురోషిణీ నాడార్ 2010లో శిఖర్ మల్హోత్రాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అర్మాన్, జహాన్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్‌లో శిఖర్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.ఇక శివ్‌ నాడార్‌ ‘చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌’ హోదాతో కంపెనీలో ఎండీగా కొనసాగనున్నారు. హెచ్‌సీఎల్‌ కంపెనీని ఆయన 1976లో ప్రారంభించారు. అజయ్‌ చౌదరీ, అర్జున్‌ మల్హోత్రా, డీఎస్‌ పురి, యోగేశ్‌ వైద్య, సుభాష్‌ అరోరాతో కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అనేక మార్పులు, విస్తరణల అనంతరం 1991లో అది ‘హెచ్‌సీఎల్‌ టెక్‌’గా రూపాంతరం చెందింది.
నాడార్‌ నిష్క్రమణతో పాటు హెసీఎల్ టెక్నాలజీస్ కంపెనీ జూన్‌ త్రైమాసికం ఫలితాలను కూడా ప్రకటించారు. గత ఏడాదితో పోల్చుకుంటే కంపెనీ నికర లాభాల్లో 31.7 శాతం పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. ఆదాయం 8.6 శాతం పెరిగి రూ.17,841 కోట్లుగా నమోదవడం గమనార్హం. మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే.. కరోనా సంక్షోభం వల్ల ఆదాయం తగ్గినప్పటికీ గత ఏడాది కంటే మాత్రం పెరిగినట్లు కంపెనీ వివరించింది.

Related Posts