న్యూఢిల్లీ, జూలై 18,
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు వైసీపీ షాకిచ్చింది. లోక్‌సభలో ఆయన కూర్చునే సీటును వెనక్కి మార్చింది. గతంలో నాలుగో లైన్‌లో ఉన్న సీటును ఏడో లైన్‌లోకి మారుస్తూ లోక్‌సభ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్షనేత ఇచ్చిన సూచనతో ఈ మార్పులు చేసినట్టు అధికారులు అంటున్నారు. ఏడో లైన్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌కు రఘురామకృష్ణ రాజు సీటు కేటాయించారు. 379 సీట్లో ఉన్న ఆయన ప్రస్తుతం 445 సీటుకు మారారు. మార్గాని భరత్ 385 నుంచి 379కి వచ్చారు. అలాగే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు 421 నుంచి 385, బెల్లన చంద్రశేఖర్‌కు 445 నుంచి 421కి కేటాయించారు. ఇప్పుడు ఉన్నట్టుండి రఘురామ సీటు మార్చడం ఆసక్తికరంగా మారింది.రఘురామకృష్ణంరాజు సొంత పార్టీ నేతలపై, ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. వారంలోగా సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులు పంపారు. కానీ ఆయన మాత్రం సమాధానం కాకుండా రిప్లై అంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఏకంగా పార్టీకే టెండర్ పెట్టారు.. అలాగే క్రమశిక్షణ కమిటీ లేదన్నారు. అలాగే సీఎం జగన్‌కు మరో లేఖ రాశారు. తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి స్పీకర్‌ను, కేంద్రమంత్రుల్ని కలవడం కాకరేపింది. అటు వైఎస్సార్‌సీపీ అధిష్గానం కూడా రఘురామ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. స్పీకర్‌కు ఫిర్యాదు చేయించింది.