హైద్రాబాద్, జూలై 18,
కరోనా నేపథ్యంలో అన్నీ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొన్ని పరీక్షలు రద్దయ్యాయి. అయితే యూజీసీ తాజా నిర్ణయంతో అన్ని కోర్సులకు సంబంధించి చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులకు సెప్టెంబరులో పరీక్షలు నిర్వహించేందుకు జేఎన్‌టీయూ సూత్రప్రాయంగా నిర్ణయించింది.కరోనా నేపథ్యంలో జేఎన్‌టీయూ పరిధిలో పరీక్షలు నిర్వహించకుండా నేరుగా విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చేలా తొలుత అధికారులు కసరత్తు చేశారు. అయితే చివరి ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ఇటీవల యూజీసీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడంతో తప్పక పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.యూజీసీ సూచనల మేరకు సెప్టెంబరు 1 లేదా 15 నుంచి పరీక్షలు నిర్వహించే దిశగా జేఎన్‌టీయూ యోచిస్తోంది. ఉన్నత విద్యా మండలి నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే పరీక్షల షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించే దిశగా వర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అటానమస్ కాలేజీలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. త్వరలో ఈ అంశంపై అధికారికంగా స్పష్టత రానుంది.