*జీవనబృందావనం*
ఆయన ప్రేమిస్తాడు కనుకనే మనను భగవంతుడు చిత్రహింసలకు క్రూరంగా గురి చేస్తాడు , మీరూ శ్రీకృష్ణుని దర్శించి , ఆయనతో క్రీడించ లేదు కనకు మీకీ విషయం అర్థం కాదు !! ( శ్రీ అరవిందులు)
శ్రీ కృష్ణుడు సర్వాంతర్యామి , ప్రతీ జీవిలోనూ , సర్వ సృష్టిలోను వర్తిస్తూ , నర్తిస్తూ తన సన్నిది కల్పిస్తాడు . ఆ పరాత్పరుని అనంతమైన ఆనందానికి , పరమ ప్రేమకూ శ్రీ కృష్ణుడు ప్రతీరూపం . ఆయనే ఆడేవాడూ , క్రీడ , ఆ క్రీడల్లో పాల్గొనే క్రీడా కారులు కూడా .. సంకల్పించేదీ , రూపకల్పన చేసేదీ , నిర్వహించేదీ పూర్తిగా ఆయనే గనుక ఈ ఈ క్రీడయొక్క స్వరూపం , పర్యవసానం ఆయనకే తెలుసు . వీటిల్లో ఆనందానికి తప్ప మరి దేనికీ తావు లేదు . కృష్ణుని దర్శించడం అంటే దైవం యొక్క అంతర్యామి తత్వాన్ని అనుభవించడమే . ఆయనతో క్రీడించడమంటే ఆ అంతర్యామిత్వం యొక్క ప్రత్యభిజ్ఞతను పొంది కృష్ణ చైతన్యం లో ఒకటై కరిగిపోవడమే . ఈ స్థితి నీకు లభిస్తే ఆ క్రీడామయుని క్రీడలోని ఆనందం తక్షణం సిద్దించినట్లే !! నీ ప్రత్యభిజ్ఞ ఎంత గాఢము , పూర్ణం అయితే , నీకు సిద్ధించే ఆనందం అంత పరిపూర్ణంగా ఉంటుంది .
నీ చైతన్యం లో ఏ మూలనైనా , ఏ కోశాన్నైనా , ఇంద్రియార్థ గ్రహాణంలో గానీ , భావంలో గానీ , అవగాహన లో గానీ , భౌతిక దృష్టి చోటు చేసుకుంటే , ఇతరులు పడే బాధలు చాలా ఘోరంగా కనిపించి , భగవంతుడు చిత్రహింసలు పెట్టే పరమ క్రూరుడిగా కనిపిస్తాడు .. అలా కాకుండా , భగవంతుని సర్వాంతర్యామింత్వం పట్ల నీకు ఎరుక కలిగితే , ఆయన క్రీడలోని మహానీయమైన ప్రేమతత్వాన్ని గ్రహిస్తారు . *ఆ అవగాహన నీకు లభించిన రోజు ఆయన ఇచ్చాపూర్వకంగా హింసకు పూనుకోవడం లేదనీ , నిన్నూ , ఈ సర్వ జగత్తునూ , ఉద్ధరించే ప్రయత్నంలో ఆ కరుణా సముద్రుడు , అత్యంత త్వరితగతిలో సారథిగా పరిపూర్ణత వైపు నడిపిస్తున్నాడనీ నీకు అర్ధం అవుతుంది* పరిపూర్ణత సాపేక్షమైనదనీ , నవ నవోన్మేషమైన ఈ పరిపూర్ణత నిరంతరం అధిగమించే ఉన్నత శిఖరాల వైపు పురోగమిస్తున్నదనీ కూడా నీకు తెలుస్తుంది !!
జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే అది పరిణామం చెందుతున్న ఉన్నత ఉత్తమ దశలను దర్శించాలి . *అంటే వర్తమానాన్ని మాత్రమే కాకుండా గతాన్ని భవిష్యత్తునూ కూడా - గతంలో ఎలా ఉంది , వర్తమానంలో ఎలా ఉంది , భవిష్యత్తులో ఎలా రూపొందభోతోందీ కూడా తక్షణమే దర్శించాలి* *దేనినీ నిరాకరించడం గానీ, పరిహారించడం గానీ చేయకూడదు* *ప్రతీ అంశానికి దాని సముచిత స్థానం దానికి ఇవ్వాలి* *అన్నిటి మధ్య మంచి పొందికగా* *కూర్పూ , అమరికా , సామరస్యమూ ఉండాలి* అప్పుడు చాందసుల చేత భ్రష్టమైనవిగా , నింద్యమైనవిగా బావింపబడి , అభిశంసించబడినవన్నీ కూడా నిజమైన దివ్య జీవితానికి ఆనందానుభూతికి హేతుభూతాలు అవుతాయి . అప్పుడు పరమ పురుషుడైన ఆ నందననందుడి ఆనంద దరహాసం అందుకోవడం గానీ , అనుభూతం చేసుకోవడం గానీ , ఆ అనుభూతిలో ఆనందంగా జీవించడం గానీ అసంభవం కాదు .. అప్పుడు ఆ నందకిశోరుని ముగ్ధమోహన దరహస కాంతిలో విషాదచాయలన్నీ మాయమవుతాయి . ప్రతీ బాధా తొలగుతుంది . ప్రతీ వ్యధకూ ఉపశమనం లభిస్తుంది. రసమయ బృందావన విహారంలో ఆనందం లభిస్తుంది. కృష్ణుడనే అంతరాదిత్యుని కాంతిహేల నీ జీవితాన్ని వెలిగిస్తుంది .