YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శ్రీ మురుడేశ్వర ఆలయం, కర్ణాటక

శ్రీ మురుడేశ్వర ఆలయం, కర్ణాటక

కర్ణాటకలోని ప్రసిద్ధ క్షేత్రం మురుడేశ్వరం. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. సంతోషం అనే అర్థం కూడా ఉంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడున్న ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి మురుడేశ్వరం అనే పేరు సార్థకం అయ్యింది. ఈ మురుడేశ్వరం, కర్ణాటక రాష్ట్రంలోని పంచలింగ క్షేత్రాలలో ఒకటి. మిగిలిన క్షేత్రాలు గోకర్ణ, సజ్జేశ్వర, గుణవంతేశ్వర, ధారేశ్వరాలు. శ్రీ మురుడేశ్వర ఆలయం ప్రాచీన పుణ్య క్షేత్రంగానే కాదు, విహారయాత్రకూ ప్రసిద్ధి చెందిన పుణ్య ప్రదేశం. ఉత్తర కన్నడ జిల్లాలోని హోన్నావర్‌ నుంచి జాతీయ రహదారి పక్కన సాగర తీరాన నెలకొన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తూ పరమ శివుడు మురుడేశ్వరస్వామిగా భక్తుల చేత నిత్య నీరాజనాలను అందుకుంటున్నాడు. ప్రకృతి అందాలు, సుందర మనోహర దృశ్యాల నడుమ అలరారుతున్న దివ్యాలయం మురుడేశ్వరాలయం.
దేశంలోనే అత్యంత పెద్ద రాజగోపురం గల ఆలయంగా ప్రసిద్ధి చెందిన మురుడేశ్వరాలయం ఇక్కడి ధార్మిక ఔన్నత్యాన్ని చాటుతూ భక్తిశ్రద్ధలకు సాక్షిగా నిలిచింది. ఈ రాజగోపుర నిర్మాణానికి తంజావూరుకు చెందిన సుమారు 500 కంటే ఎక్కువ మంది స్థపతులు దాదాపు పదేళ్ల పాటు అవిశ్రాంతంగా శ్రమించారు. ఉత్తర కన్నడ జిల్లా భట్కళ సమీపంలో జాతీయ రహదారి మార్గంలో మురుడేశ్వర క్షేత్రం ఉంది. దేవాలయానికి ఎదురుగా విశిష్టమైన రాజగోపురాన్ని నిర్మించారు. ఇది 250 అడుగుల బృహత్‌నిర్మాణం. దీని వెడల్పు 105 అడుగులు. ఇది క్రమంగా తగ్గుతూ శిఖరాగ్రానికి చేరేసరికి 78 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ భవ్యమైన గోపురంలో 21 అంతస్తులు ఉన్నాయి. గోపుర గోడలపై ద్రావిడ శైలిలో చెక్కిన సుందరమైన శిల్పాలను చూడవచ్చు. ఇక్కడి శిల్ప సౌందర్యం, ప్రకృతి రమణీయత, ప్రశాంత వాతావరణం భక్తుల హృదయాల్లో మధురానుభూతిని నింపుతాయి.
మురుడేశ్వర పర్వతం పైన పద్మాసనంలో చిన్ముంద్రాకింతుడైన మహాశివుని విగ్రహం కేవలం ఎత్తులోనే కాక ధీరగంభీర ముఖ సౌందర్యంలో శ్రమ సౌందర్యాన్ని చాటుతుంది. దండ కమండలాలు, శూల దండనాలు శివోన్నతికి ప్రతీకలై గోచరిస్తాయి. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద శివస్వరూపం. యోగులు, మహా పురుషుల పాదస్పర్శతో పునీతమైన ఈ దివ్యాలయం వారి తపోబలంతో మరింత ప్రసిద్ధినొందింది. బృహదాకారపు ఈశ్వరుని శిలామూర్తికి ఎదురుగా నిలిచిన నందీశ్వరుని విగ్రహ పీఠభాగంలోని శివలింగాన్ని 2008వ సంవత్సరంలో శృంగేరి శారదాపీఠ శ్రీ భారతి తీర్థుల వారి ప్రతినిధి శ్రీ సద్యోజాత శ్రీ శంకరాశ్రమ స్వాముల వారు ప్రతిష్ఠించారు. ఈ మహా శివుని మహా మూర్తి ప్రతిష్ఠించిన పీఠభాగంలో అద్భుతమైన గుహాలయం ఉంది. అందులో ఆత్మలింగావిష్కరణ క్రమాన్ని శిలాగాథగా మార్చారు.
స్థలపురాణం :-
పూర్వం రావణాసురుడు భక్తితో శివుని మెప్పించి, కైలాసం నుంచి ఆయన ఆత్మలింగాన్ని తీసుకుని వస్తుంటాడు. రావణాసురుడి చేతికి శివుడి ఆత్మలింగం చిక్కితే, అతను దాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ఇక రావణుని అకృత్యాలకు అడ్డుకట్ట వేయగలవారే ఉండరనే ఉద్దేశ్యంతో దేవతల కోరికమేరకు వినాయకుడు ఒక పిల్లవాడి రూపంలో వస్తాడు. సాయంత్రం వేళ సంధ్యావందనం చేయడం కోసం ఆత్మలింగాన్ని ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రావణుడు, సరిగ్గా అదే సమయంలో రావణుడి కంట పడతాడు బ్రాహ్మణ బాలుడి వేషంలో ఉన్న గణపతి. కాసేపు శివలింగాన్ని చేతితో పట్టుకుని ఉంటే, తాను స్నానసంధ్యలు ముగించుకుని వస్తానని చెప్పి వెళతాడు రావణుడు. అయితే పథకం ప్రకారం, రావణుడు వచ్చేలోగా శివలింగాన్ని నేలమీద పెట్టేస్తాడు మన విఘ్నేశ్వరుడు. ఇంకేముంది, ఆత్మలింగం భూమిలో దిగబడిపోతుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాదు. అప్పుడు రావణుడు ఆగ్రహంతో ఆత్మలింగానికి కప్పి ఉన్న వస్త్రం, కవచం, దారం తదితర వస్తువులను విసిరి పారేస్తాడు. ఆ వస్తువులు పడిన ప్రదేశాలే పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. వినాయకుడు ఆత్మలింగాన్ని మోయలేక భూమిపై ఉంచిన ప్రదేశం "గోకర్ణ"గా కీర్తించబడుతోంది. ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరేస్తే, ఆ వస్త్రం పడిన ప్రదేశమే మురుడేశ్వరం.
గర్భాలయంలోకి చేరుకొన్న భక్తులు శ్రీ మురుడేశ్వరస్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని అచంచల భక్తి విశ్వాసాలను స్వామి వారి పట్ల ప్రదర్శించి అద్వితీయ ఆనందం చెందుతారు. ఇదే ఆలయంలో కొలువైన ఇతర దేవీదేవతల దర్శన భాగ్యంతో సమస్త సిద్ధులు వరిస్తాయని భక్తుల నమ్మకం. క్షేత్రపాలకుడైన శ్రీ మురుడేశ్వరుని పరివారంగా శ్రీ గణపతి, గౌరీ, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, నవగ్రహ మందిరాలు ఇక్కడ ఉన్నాయి. ఎదురుగా నందీశ్వర మండపం, ధ్వజస్తంభాలున్నాయి. అక్కడక్కడ బలిపీఠాలున్నాయి. బయట ద్వారపాలకుడైన వాగిలజిట్టిగని గుడి, అశ్వత్థ వృక్షాలు ఉన్నాయి. మురుడేశ్వర ఆలయానికి అధిష్ఠాన శిఖరమైన కందుగిరిలో కమండల తీర్థం, జటా తీర్థం, భీమ తీర్థం, శంకు తీర్థాలు ఉన్నాయి.
ఇక్కడ ప్రాతఃస్మరణం, మధ్యాహ్నికం, సాయంకాలాలు అంటే త్రికాల పూజలు యథావిధిగా జరుగుతాయి....
*సనాతన ధర్మస్య రక్షిత రక్షితః*

Related Posts