*అమ్మవారి నాభిస్థానంలో పంచముఖ శివుడు ఆసీనుడై కనిపించే అద్భుతం*
త్రిమూర్తులు సహా ముక్కోటి దేవతలందరినీ నడిపించే తల్లి జగజ్జనని. సకల చరాచర జగత్తును సృష్టించిన తల్లి జగజ్జనని. అలాంటి శక్తి స్వరూపిణిని కాళీ, దుర్గ, లక్ష్మి, సరస్వతి రూపాల్లో దర్శనం చేసుకుంటాం. కానీ జగజ్జనని రూపంలో ఆ తల్లిని మాత్రం చాలా తక్కువమంది దర్శించుకొని ఉంటారు. ఇలా జగజ్జనని రూపంలో ఆ తల్లి వెలసిన ఆలయాలు ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నవి. మరి ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆ అమ్మవారి రూపం ఎలా ఉంటుంది? ఆ ఆలయం విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, నంద్యాలలో శ్రీ జగజ్జనని ఆలయం ఉంది. ఈ అమ్మవారి ఆలయాలు ప్రపంచంలో రెండు ఉండగా అందులో ఒకటి హిమాలయ పర్వతాల్లోని మానస సరోవరం లో ఉండగా, మరొక ఆలయం ఈ ప్రాంతంలో ఉందని చెబుతారు. ఇక మానస సరోవరంలో వెలసిన అమ్మవారు స్వయంభువు అని చెబుతారు. కానీ ఆ విగ్రహం ప్రస్తుతం శిధిలావస్తలో ఉందని చెబుతారు. ఇక ఈ ఆలయంలో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక కొత్త అనుభూతి వస్తుందని అంటారు.
ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం నంద్యాలకు చెందిన శివనాగపుల్లయ్య అనే వ్యక్తి భవానీ మాత భక్తుడు. అతను ప్రతి సంవత్సరం కూడా తప్పకుండ భవానీ మాల ధరించేవాడు. అయితే 1983 వ సంవత్సరంలో అయన భవానీ దీక్షలో ఉన్నపుడు యాత్రలో భాగంగా అహోబిలానికి వెళ్లగా అక్కడ కొంతమంది యోగులని కలిసాడు. అప్పుడు వారి మధ్య ఆధ్యాత్మిక చర్చ జరుగగా జగజ్జనని ప్రస్తావన వచ్చినది. అందులో ఉన్న ఒక యోగి జగజ్జనని రూపం గురించి తెలియచేసి అతడికి ఆ అమ్మవారి రూపం ఉన్న ఒక చిత్ర పటాన్ని ఇవ్వగా అందులో ఉన్న అమ్మవారి దివ్య మంగలా రూపాన్ని చూసి ముగుడై ఈ అమ్మవారి రూపాన్ని ఇప్పటివరకు చూడలేదే అని చాలా ఆవేదన చెందాడు. ఇలా అమ్మవారి ఆలయ కేవలం హిమాలప్రాంతంలో ఉన్న మానస సరోవరంలో మాత్రమే ఉందని తెలుసుకున్న అతడు ఎలాగైనా తన ప్రాంతంలో ఆ అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని భావించాడు.
ఇలా ఆ అమ్మవారి ఆలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించాడు. ఇక ఈ ఆలయంలో గర్భాలయంలో జగజ్జనని నల్లరాతితో చేసిన తొమ్మిది అడుగుల ఎత్తు ఉంది ఎన్నో ప్రత్యేకతలతో దర్శనం ఇస్తుంది. అమ్మవారి నాభిస్థానంలో పంచముఖ శివుడు ఆసీనుడై కనిపిస్తాడు. పాదపీఠ భాగంలో శ్రీ మహావిష్ణువును కొలువు తీర్చిన తీరు అద్భుతం. ఈ అమ్మవారు అష్టభుజాలతో దర్శనం ఇవ్వగా, కుడివైపున ఉన్న చేతుల్లో చంద్రమండలం, సూర్యమండలం, భూమండలం, అభయహస్తం, లక్ష్మీదేవి, త్రినేత్రం, త్రిశూలం ఉంటాయి. ఎడమవైపు ఒక చేతిలో శంఖం, రెండో చేతిలో డమరుకం, మూడొచేతిలో ధనుస్సు, నాల్గవ చేతిలో బ్రహదేవుడు ఉంటారు. ఇంకా 17 తలల ఆదిశేషుడు అమ్మవారికి చత్రంగా కనిపిస్తాడు. ఇలా అమ్మావారు సింహవాహనం పై దర్శనం ఇస్తూ భక్తులని మంత్రముగ్దుల్ని చేస్తుంది.