ఒంగోలు, జూలై 20,
జూపూడి ప్రభాకర్ రావు మరోసారి రాజకీయాల్లో క్రియాశీలం కావాలనుకుంటున్నారు. ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావు కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉంటున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో భర్తీ కానున్న ఎమ్మెల్సీ పోస్టుల్లో ఒకటి ఎస్సీకి, ఒకటి ముస్లిం సామాజికవర్గాలకు జగన్ కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో జూపూడి ప్రభాకర్ రావు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే ఆయన మాత్రం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.మరోవైపు జూపూడి ప్రభాకర్ రావు కొండపి రాజకీయాలపై కూడా కన్నేశారు. 2014 ఎన్నికల్లో కొండపి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జూపూడి ప్రభాకర్ రావు ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో కొండపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన మాదాసి వెంకయ్య ఓటమిపాలయ్యారు. ఆయనను వైసీపీ అధిష్టానం ప్రస్తుతం ఇన్ ఛార్జిగా నియమించింది. పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ గా కూడా నియమించింది.అయితే మాదాసి వెంకయ్య స్వతహాగా డాక్టర్ కావడం, రాజకీయాలు పెద్దగా తెలియకపోవడంతో కొండపి నియోజకవర్గంలో పట్టు సాధించలేకపోతున్నారు. ఫుల్ టైం పాలిటిక్స్ నడప లేకపోతున్నారు. ఎన్నికలకు ముందు వరకూ కొండపికి ఇన్ ఛార్జిగా ఉన్న వరికూటి అశోక్ బాబు కూడా మాదాసి వెంకయ్యకు సహకరించడం లేదు. మాదాసి వెంకయ్య వైవీ సుబ్బారెడ్డి వర్గం కాగా, వరికూటి అశోక్ బాబు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గంగా ఉన్నారు.దీంతో ఇద్దరినీ కాకుండా తనకు ఇన్ ఛార్జి పదవిని ఇవ్వాలని జూపూడి ప్రభాకర్ రావు కోరుతున్నారు. ఈ మేరకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఆయన ఇటీవల సమావేశమయినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పదవి కోసం ఒకవైపు ప్రయత్నిస్తూనే, కొండపి ఇన్ ఛార్జి పదవి కోసం కూడా ఆయన పట్టుబడుతున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు కాని, కొన్ని నెలల తర్వాత జూపూడి ప్రభాకర్ రావు రాజకీయంగా తిరిగి యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది.