విజయవాడ, జూలై 20,
వైసీపీలోనే ఓ ఆశ్చర్యకరమైన చర్చ సాగుతోంది. మంత్రి పదవుల్లో ఉన్న కొందరు నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో వారి బంధువులు షాడో మినిస్టర్లుగా చక్రం తిప్పుతున్నారని. దీంతో పార్టీ పరువు రోజు రోజుకు మైనస్ డిగ్రీల్లోకి వెళ్లిపోతోందని చెవులు కొరుక్కుంటున్నారు. మంత్రులు వారి అనుచరులు, బంధువులను అదుపులో పెట్టలేక పోతున్నారని, దీంతో దాదాపు అన్ని జిల్లాల్లోనూ పరిస్థితి చేయి దాటి పోతోందని పార్టీలోనేచర్చ వస్తోంది. కొన్ని రోజుల కిందట పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి శ్రీరంగనా థరాజు కుమారుడుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. జిల్లాలో ఆయన షాడో మినిస్టర్‌గా చలామణి అవుతున్నా రని అంటున్నారు. ఇదే విషయంపై పార్టీ అసంతృప్త ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి రంగరాజు అందరి కన్నా పెద్ద దొంగ అని… ఆయన, ఆయన కుమారుడు చేసే అక్రమాలు, అన్యాయాలకు అంతే లేదని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఇక, ఏకంగా రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత కుటుంబంలోనూ షాడో మినిస్టర్ ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఆయనే నేరుగా బదిలీల వ్యవహారాలు చక్కబెట్టేందుకు ప్రయత్నించారు. ఫైళ్లను ఇంటికి కూడా తెప్పించుకున్నారని అయితే, ఈ విషయం సీఎం జగన్‌కు తెలియడంతో పిలిచి ప్రశ్నించడంతో కొంత మేరకు వెనక్కితగ్గారని, అయితే, ఇప్పుడు మాత్రం మళ్లీ `ఆయనే` రెచ్చిపోతున్నారని అంటున్నారు. వృత్తి రీత్యాఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడం,ఉన్నతస్థాయిలో ఉండడంతో షాడో మినిస్టర్‌గా చక్రం తిప్పేందుకు ఆయన ఉత్సాహం చూపుతున్నారని అంటున్నారు.కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈమె కుటుంబం నుంచి కూడా షాడో మినిస్టర్లు.. చక్రం తిప్పుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. నియోజకవర్గంలో `సార్` పేరు ఘనంగానే వినిపిస్తోంది. ఆయనకు చెప్పుకొంటే.. చాలని మంత్రిగారు పనిచేసి పెడతారని అంటున్నారు. గత కొన్నాళ్లుగా లోపాయికారీగా ఉన్న ఈ వ్యవహారంపై ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటుండడం గమనార్హం. అదేవిధంగా.. కడపలోనూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా బంధువు ఒకరు అన్నీ తానై వ్యవహ రిస్తున్నట్టు పార్టీలోనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ చీఫ్ విప్ కూడా ఈ జిల్లాకు చెందిన నాయకుడే కావడంతో ఈ విషయంపై అధిష్టానం వద్ద కూడా ఫిర్యాదు వెళ్లిందని అంటున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా షాడో మినిస్టర్ల హవా భారీగానే ఉందని అంటున్నారు.