కడప, జూలై 20,
అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గాల్లో పట్టుకోల్పోతుంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే వారే లేరు. ప్రధానంగా కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉండేది. టీడీపీ ఆవిర్భావం నుంచి అక్కడ పొన్నపురెడ్డి కుటుంబం అండగా ఉండేది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ టీడీపీ కి సారథ్యం వహించే నేత కరువయ్యారని చెప్పక తప్పదు.గత ముప్పయి ఏళ్లుగా జమ్మలమడుగు నియోజకవర్గంలో పొన్నపు రెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబం టీడీపీని నమ్ముకుని ఉంది. అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం నిర్ణయం ఈ నియోజకవర్గంలో టీడీపీ చరిత్రను మార్చేసింది. 2014 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి రామసుబ్బారెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి గెలిచిన దేవగుడి ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకు వచ్చి మంత్రి పదవిని ఇచ్చారు.దీంతో 2019 ఎన్నికల్లో మళ్లీ ఓటమిపాలయిన రామసుబ్బారెడ్డి టీడీపీని వీడారు. వైసీపీలో చేరారు. అక్కడ సుధీర్ రెడ్డి గెలిచారు. ఆదినారాయణరెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిపోయారు. దీంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నేత లేకుండా పోయారు. కనీసం పార్టీ ఇన్ ఛార్జి పదవిని చేపట్టేందుకు కూడా సరైన నేత జమ్మలమడుగు నియోజకవర్గంలో లేకపోవడం విశేషం. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లో కూడా నేత లేనట్లే.ఇప్పటి వరకూ పొన్నపురెడ్డి, దేవగుడి కుటుంబాల మధ్య మాత్రమే జరిగిన పోటీ ప్రస్తుతం తొలగిపోయినట్లే. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జమ్మల మడుగు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డిల మధ్య కొంత గ్యాప్ ఉన్నా రానున్న కాలంలో అవి సర్దుకుపోతాయని అంటున్నారు. వైసీపీ రోజురోజుకూ స్ట్రాంగ్ అవుతున్నా దశలో తెలుగుదేశం పార్టీ మాత్రం రోజురోజుకూ బలహీన పడుతుంది. మరి జమ్మల మడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి మరి.