గుంటూరు, జూలై 20,
వైసీపీకి చెందిన నాయకుల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమకు స్వతంత్రం లేకుండా పోయిందని , తాము గతంలో అనేక రూపాల్లో ప్రజలకు చేరువై.. పార్టీ కార్యక్రమాలను, పార్టీ విధానాలను ప్రజలకు వివరించామని, అయితే, ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నా.. తమను అడ్డుకుంటున్నారని, ఇలా అయితే, కష్టమేనని వారు ఆరోపిస్తున్నా రు. అయితే, నిన్న మొన్నటి వరకు కేవలం కొన్ని జిల్లాల్లోనే వినిపించిన ఈ అసంతృప్తి సెగలు.. ఇప్పుడు చాలా జిల్లాలనుంచి వినిపిస్తున్నాయి. అంతేకాదు, నేరుగా వారు పార్టీ కేంద్ర కార్యాలయానికి సదరు అంశాలను చేరవేస్తున్నారు.దీంతో అసలు ఏం జరుగుతోందనే విషయం ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ముందు ప్రతి కార్యకర్త.. పార్టీలో చురుగ్గా ఉన్నారు. జగన్‌ను సీఎంగా చూడాలని కూడా కలలు కన్నారు. ఈ క్రమంలోనే వారు పార్టీ కార్యక్రమాలను నాయకుల కన్నా కూడా వేగంగా ప్రజల్లోకి చేరవేశారు. ఇది పార్టీకి చాలా ఉపకరించింది. అయితే, ఇటీవల కాలంలో జిల్లాల్లో ఇంచార్జ్ మంత్రుల దూకుడు ఎక్కువైంది. వాస్తవానికి కొన్నాళ్ల కిందట వరకు ఇంచార్జ్ మంత్రులు పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యేలు, నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించారు . అయితే, ఆ తర్వాత జగన్.. ఇంచార్జ్ మంత్రులను మార్పు చేశారు. దీంతో వారు దూకుడు పెంచారు.అయితే, ఈ దూకుడు పార్టీకి, నేతలకు మేలు చేసేలా ఉండాల్సి ఉండగా.. దీనికి విరుద్ధం.. పార్టీలో కార్యకర్తలకు, దిగువశ్రేణి నేతలకు ఇబ్బంది కలిగించేలా ఉండడం గమనార్హం. ఈ పరిణామాలతో కార్యకర్తలను పట్టించుకునే నాయకుడు కనిపించడం లేదు. పలు జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడిన సీనియర్ నేతలను ఎన్నికలకు ముందు పార్టీలో చేరి గెలిచిన జూనియర్ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. ఎన్నికలకు ముందు గెలిచిన ఎమ్మెల్యేలు తమకు ఎవరు అనుకూలంగా ఉంటారో ? వారికే పదవులు ఇస్తున్నారు. దీంతో సీనియర్లు, పార్టీ కోసం ఎప్పటి నుంచో గెలిచిన నేతలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.ఇదే విషయాన్ని జిల్లా పార్టీ నేతలకు, ఇన్‌చార్జ్ మంత్రులకు చెప్పుకున్నా అంతిమంగా ఎమ్మెల్యేల మాటే నెగ్గుతోంది. దీంతో పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడిన కేడర్‌కు, నేతలకు మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. ప్రభుత్వ పథకాల విషయంలో తమకే అన్యాయం జరుగుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదని, ఏదైనా చెబితే. ఇంచార్జ్ మంత్రితో మాట్లాడాలని అంటున్నారట. దీంతో వారు నేరుగా కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదులు పంపుతున్నారు. ఈ విషయం సీఎం జగన్‌కు తెలియడంతో ఆయన సదరు ఇంచార్జ్ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా ఇప్పటకీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు.