YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అనంతలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

అనంతలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

అనంతపురం, జూలై 20, 
వారిద్దరూ పోలీసు వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. రాజకీయాల్లో భవిష్యత్తును వెతుక్కుంటున్నవారే. ఇద్దరిదీ ఒకే పార్టీ అయినా ఒకరంటే ఒకరికి పడటం లేదు. దీనికి ప్రధాన కారణం ఆధిపత్యపోరు అని చెప్పక తప్పదు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. ఎంతవరకూ వెళ్లాయంటే ఒకరు పాల్గొనే కార్యక్రమానికి మరొకరు రానంతగా. దీంతో పార్టీ క్యాడర్ ఇద్దరి మధ్య నలిగిపోతుంది.పోలీసు అధికారిగా ఉంటూ గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో ఆయన హిందూపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయనకు వచ్చే ఎన్నికలలో హిందూపురం శాసనసభ నుంచి పోటీ చేయాలన్న కోరిక పుట్టింది. దీంతో ఎక్కువగా హిందూపురం శాసనసభ నియోజకవర్గంపైనే గోరంట్ల మాధవ్ ఎక్కువ దృష్టి పెట్టారు. అక్కడే ఎక్కువ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా హిందూపురం అసెంబ్లీ పరిధిలో తనకంటూ ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసుకుంటున్నారు.గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి మహ్మద్ ఇక్బాల్ పోటీ చేశారు. అయితే ఆయన బాలకృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీ అధినేత జగన్ వెంటనే మహ్మద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈయన హిందూపురంలో అందుబాటులో ఉండటం లేదని విమర్శలు విన్పిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో బాధితులకు అండగా చేపట్టే కార్యక్రమాల విషయంలో మహ్మద్ ఇక్బాల్ కు, గోరంట్ల మాధవ్ కు మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. గోరంట్ల మాధవ్ తనకు తెలియకుండా హిందూపురంలో విరాళాలు వసూలు చేశారని పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు.
అయితే దీనికి ప్రతిగా గోరంట్ల మాధవ్ మహ్మద్ ఇక్బాల్ హిందూపురం నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదని పార్టీ అధిష్టానానికి ప్రతిగా ఫిర్యాదు చేశారు. తాజాగా వైఎస్సార్ జయంతి రోజున హిందూపురంలో ఎవరికి వారే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. మరో నేత నవీన్ నిశ్చల్ మరో వర్గంతో హిందూపురంలో కార్యక్రమాన్ని జరిపారు. దీంతో హిందూపురం వైసీపీలో మూడు గ్రూపులుగా తయారవ్వడంతో క్యాడర్ అయోమయంలో పడింది. మరి పార్టీ హైకమాండ్ వీరిపై ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మరి ఈ ఇద్దరు మాజీ పోలీసు బాసుల్లో ఎవరూ పైచేయి సాధిస్తారో?

Related Posts