సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో విడిగా సమావేశమయ్యారు. ఇరువురి మధ్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు టోనీ బ్లెయర్ ను ఏపీ సందర్శనకు ఆహ్వానించారు. ఏపీ పర్యటనకు టోనీ బ్లెయర్ కూడా ఆసక్తి చూపారు. ఒకప్పటి తన హైదరాబాద్ సందర్శనను, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో కలిసి మహబూబ్ నగర్లోని ఒక గ్రామాన్ని పరిశీలించిన వైనాన్ని టోనీ బ్లేయర్ గుర్తుచేసుకున్నారు. కొత్త రాష్ట్రం ఎలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగి తెలుసుకున్ఆరు. చంద్రబాబు నాయకత్వంలో కొత్త రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తున్న తీరు తనకు తెలుసునని అన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి రైతులు ముందుకొచ్చి తమకు సమీకరణ విధానంలో ఎలా భూములు అందించిందీ తదితర విషయాఅను టోని బ్లేయిర్ కు ముఖ్యమంత్రి వివరించారు. పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు, వచ్చే 15, 20 ఏళ్ల పాటు 15 శాతం సుస్థిర వృద్ది లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తున్న వైనం, ఫైబర్ కనెక్టివిటీ, ఆహార శుద్ధి రంగంలో ఏపీలో ఉన్న అపార అవకాశాలను బ్లేయర్ కు వివరించారు. 1978 నుంచి 40 ఏళ్ల పాటు చంద్రబాబు రాజకీయాలలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడం ఎలా సాధ్యమని బ్లేయర్ ఆశ్చర్యం వ్యక్తంచేసారు.
రియల్టైమ్ గవర్నెన్స్, కాంప్రహెన్సీవ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్, విద్యుత్ సంస్కరణలు, సౌర, పవన విద్యుత్ విధానాలు, నూరుశాతం ఓడీఎఫ్, ఐవోటీ, డ్రోన్లు, అప్లికేషన్లతో వ్యవసాయ రంగానికి సాంకేతికత జోడింపు వంటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కుడా బ్లేయర్ కు చంద్రబాబు వివరించారు.