YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాజస్థాన్‌లో మలుపులు తిరుగుతోన్న రాజకీయ సంక్షోభం కేంద్ర మంత్రి షెకావత్‌ కు ఎస్ఓజీ నోటిసులు

రాజస్థాన్‌లో మలుపులు తిరుగుతోన్న రాజకీయ సంక్షోభం  కేంద్ర మంత్రి షెకావత్‌ కు ఎస్ఓజీ నోటిసులు

న్యూఢిల్లీ జూలై 20  
రాజస్థాన్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం మలుపులు తిరుగుతోంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు తెరవెనుక 'మాస్టర్ మైండ్‌'గా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ వ్యవహరించారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ సాగిస్తున్న రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు (ఎస్ఓజీ) తాజాగా షెకావత్‌కు నోటీసులు పంపింది. ఈ కేసులో ప్రశ్నించేందుకు వీలుగా తమ ముందు హాజరుకావాలని ఎస్ఓజీ ఆ సమన్లలో పేర్కొంది.రాజస్థాన్‌లోని తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి గెహ్లాట్ స్వయంగా ఈ ఎస్‌ఓజీని ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంతవరకూ ఇద్దరిపై ఎఫ్ఐఆర్‌లను ఎస్ఓజీ నమోదు చేసింది.కాగా, గెహ్లాట్‌ ప్రభుత్వాన్ని కూల్చే విషయాన్ని చర్చించినట్టు తన వాయిస్‌తో వచ్చిన అడియో టేపును గజేంద్ర షెకావత్ కొట్టివేశారు. అది నకిలీ టేపని చెప్పారు. ఎలాంటి దర్యాప్తునకైనా సిద్ధమని అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సైతం అంతే వేగంగా స్పందించింది. దర్యాప్తు పూర్తయ్యేంత వరకూ షెకావత్ తన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది.మరోవైపు, ఆడియో టేపులో ఉన్న మరో వాయిస్‌కు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి ఆ పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. శర్మతో పాటు మరో తిరుగుబాటు ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సచిన్ పైలట్‌కు మద్దతుగా నిలిచిన వారిలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, పార్టీ రాష్ట్ర అధక్ష పదవి నుంచి పైలట్‌‌ను కూడా తొలగించారు. స్పీకర్ పంపిన అనర్హత వేటు నోటీసుపై పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించగా, 21వ తేదీ మంగళవారం వరకూ వారిపై ఎలాంటి చర్య తీసుకోవద్దని స్పీకర్‌ను కోర్టు గత శుక్రవారంనాడు ఆదేశించింది.

Related Posts