ఒంగోలు, జూలై 21,
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి ఆదిమూలపు సురేష్ పై ఎర్రగొండపాలెం ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సురేష్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఏడాది నుంచి ఆయన పత్తా లేరని, తమ సమస్యలు చెప్పుకుందామన్నా వినే పరిస్థితి లేదంటున్నారు. దీనికి తోడు తనకు బదులు నలుగురిని నియోజకవర్గంలో ఇన్ ఛార్జిలుగా నియమించడం మరింత వివాదానికి దారి తీసింది.ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించారు. 2009లో తొలిసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ పై వ్యతిరేకతను పసిగట్టిన అధిష్టానం మరో ఎస్సీ నియోజకవర్గమైన సంతనూతలపాడుకు పంపింది. అక్కడ కూడా సురేష్ గెలిచారు. పార్టీ అధికారంలోకి రాకపోయినా ఆదిమూలపు సురేష్ జగన్ వెన్నంటే నిలిచారు.2019 ఎన్నికల్లో తిరిగి ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి గెలిచిన ఆదిమూలపు సురేష్ తొలి కేబినెట్ లోనే చోటు దక్కించుకున్నారు. అయితే ఆయన అప్పటి నుంచి ఎర్రగొండ పాలెం నియోజకవర్గంలో పెద్దగా కన్పించడం లేదు. మంత్రి పదవిలో బిజీగా ఉండటంతో ఆయన నియోజకవర్గానికి ఎక్కువగా రాలేకపోతున్నారు. దీంతో తమ సమస్యలను చెప్పుకుందామనుకునే వారికి ఇబ్బందిగా మారింద.ి ఇది గమనించిన ఆదిమూలపు సురేష్ నాలుగు సామాజికవర్గాలకు చెందిన వైసీపీ నేతలను ఇన్ ఛార్జులుగా నియమించారు.తన పరోక్షంలో సమస్యలను పరిష్కరించే బాధ్యతలను కందుల గురు, హబీబుల్ల, కిరణ్ గౌడ్, మూర్తి రెడ్డిలకు అప్పగించాు. వీరు మంత్రిగారు లేని సమయంలో లాబీయింగ్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ నలుగురు తమ సన్నిహితులకే ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీంతో ఆదిమూలపు సురేష్ కు వీరిపై కూడా పెద్దయెత్తున ఫిర్యాదులు అందాయట. మొత్తం మీద మంత్రి అయిన తర్వాత ఆదిమూలపు సురేష్ కన్పించడమే మానేశారంటున్నారు ఎర్రగొండపాలెం వాసులు. మరి మంత్రిగారు నియోజకవర్గాన్ని కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుందేమో.