లండన్, జూలై 22,
కరోనా వ్యాక్సిన్ ను భారీ ఎత్తున సొంతం చేసుకునేందుకు బ్రిటన్ కీలక ఒప్పందాలను చేసుకుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న రెండు ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ల 9 కోట్ల మోతాదులు కొనుగోలుకు బ్రిటన్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వ్యాపార మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్-19 నివారణ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో మూడు రకాల వ్యాక్సిన్లను ఆర్డర్ చేశామని, దీంతో మొత్తం 230 మిలియన్ మోతాదులను అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశామని తెలిపింది.జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్, అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్ ఆధ్వర్యంలో రానున్న వ్యాక్సిన్ 30 మిలియన్ మోతాదులు, 60 మిలియన్ మోతాదుల వాల్నేవా వ్యాక్సిన్ కొనుగోలుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఈ వ్యాక్సిన్ ఫరీక్షల్లో విజయవంతమైతే మరో 40 మిలియన్ల మోతాదులను కూడా పొందేలా ఈ డీల్ ఖాయం చేసుకుంది. ప్రపంచంలోని ప్రముఖ ఔషధ, వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో ఈ కొత్త భాగస్వామ్యంద్వారా ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే వ్యాక్సిన్‌ను భద్రపరచడానికి తమకు ఉత్తమమైన అవకాశాన్ని లభించిందని వ్యాపార మంత్రి అన్నారు. ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడుతున్న వ్యాక్సిన్ వంద మిలియన్ మోతాదులను కొనుగోలు ఒప్పందాన్న గతంలో ప్రకటించడం గమనార‍్హం.కాగా కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. 150కి పైగా వ్యాక్సిన్లు పరీక్షల దశలో ఉన్నాయి. ప్రధానంగా ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్-ఆస్ట్రాజెనెకా- క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన డేటా ఇవాళ వెలువడింది. లాన్సెట్ మెడికల్ జర్నల్‌లో ఈ ఫలితాలను ప్రచురించారు.ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ ద్వారా రోగనిరోధక ప్రతిస్పందన గుణం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఇది సురక్షితమైనదని వెల్లడించారు. ఈ క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 1,077 మందిపై వ్యాక్సిన్ ప్రయోగించగా.. వీరిలో యాంటీబాడీస్‌తోపాటుగా, కరోనాతో పోరాడగలిగే తెల్ల రక్తకణాలను ఏర్పరచడానికి తోడ్పడిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని అన్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లలోని పలువురిలో జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయని.. అయితే పరిశోధకులు వాటిని పారాసిటమాల్‌తో తగ్గించగలిగారని చెప్పారు. అయితే ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో కరోనాను అడ్డుకోగలుగుతుందో లేదో తెలియాలంటే.. మరిన్ని పరీక్షలు జరగాల్సి ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.మరోవైపు యూఎస్ బయోటెక్ సంస్థ మోడెర్నా కూడా తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసింది. జూలై 27 న హ్యూమన్ ట్రయల్స్ చివరి దశను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఈ ట్రయల్స్‌లో 30వేల మంది అమెరికన్లు పాల్గొంటారు. అలాగే మోడెర్నా టీకా సురక్షితమని అమెరికా పరిశోధకులు ఇప్పటికే నివేదించారు. ప్రారంభ దశ అధ్యయనంలో మొత్తం 45 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లలో ఇది విజయవంతమైన ఫలితాలనిచ్చినట్టు తెలిపారు.