తిరుపతి, జూలై 21,
చిత్తూరు జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. రోజు, రోజుకు పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు భయపెడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నగరంలో దాదాపు 1500కుపై కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించారు.. పరిస్థితిని కాస్త అదుపు చేసేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మంగళవారం నుంచి సంపూర్ణ ఆంక్షలు విధిస్తున్నట్లు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.
మంగళవారం నుంచి అత్యవసర సేవలు, మెడికల్ షాపులు మినహా మిగతా షాపులు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత వాహనాలకు కూడా అనుమతించమని.. ఈ ఆంక్షలు ఆగస్టు 5 వరకు కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చారు. ఈనెల 31న సమావేశమై పాజిటివ్ కేసుల సంఖ్యను బట్టి లాక్‌డౌన్ తరహా ఆంక్షలను కుదించాలా, మరో 14 రోజులు పొడిగించాలా అన్న నిర్ణయం తీసుకుంటామన్నారు.
చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ తీవ్రత అధికమవుతున్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కలెక్టర్ కోరారు. ప్రతీ ఒక్కరూ విధిగా నిబంధనలను పాటించి సహకరించాలని ఎస్పీ రమేష్ రెడ్డి అన్నారు. పోలీసు శాఖలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ఇప్పటికే ఇద్దరు పోలీసులు కరోనా కారణంగా మరణించారని పేర్కొన్నారు.