సందేహం;- మనకు ఎన్నో వ్రతాలున్నాయి. అయితే మనిషి నడతను సరిదిద్దే వ్రతమేదైనా ఉందా చెప్పండి?
సమాధానం;- ఏ వ్రతం చేసినా, ఏ నోము నోచినా నియమాలంటూ ఉండకపోవు. అయితే గోదాదేవి ఆచరించి చూపిన *తిరుప్పావు* (శ్రీవ్రతం) లో మాత్రం మన ఉజ్జీవనం కోసం పది నియమాలను ప్రత్యేకంగా చెప్పింది.
తిరుప్పావు రెండవ పాశురం "వైయత్తు వాళ్ వీర్ గాళ్" లోకాన సుఖము తూగాడు సఖులారా నోమునకు సేయు కలాపములు వినుడు అంటూ ఈ ధనుర్మాసవ్రతం చేసేవారు పాటించే నియమాలు చెపుతున్నది.
బాగా వేకువనే లేచి, క్షీరసాగరంలో మెల్లగా పవళించిన శ్రీమహావిష్ణువును సంకీర్తనం చేస్తాం. వేకువనే స్నానంచేసి పవిత్రులమవుతాం. సిరినోము పూజచేస్తాం. ప్రసాదంలో తప్ప పాలు, నేయి తీసుకోకుండా నియమితాహార నియమము పాటిస్తాం. కంటికి కాటుక పెట్టుకోము. పూలు ముడవము. కృష్ణుడు చూచి ఆనందించనంత వరకు ఏ అలంకరణలు మాకు అక్కరలేదు. మా పెద్దల ఆచరణలోలేని పనులు తలపెట్టం.
"తీక్కురళై చెన్రోదోమ్" ఇతరుల వద్ద చేరి ఎదుటి వారిపై అదే పనిగా చాడీలు చెప్పం. మా పలుకు సత్యము, హితము, ప్రియము అయి ఉండాలి. "సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, సత్యమప్రియం నబ్రూయాత్" అది సత్యమైనా అప్రియం కలిగించేదైతే చెప్పము. ఆత్మ స్తుతి, పరనిందల జొలికిపోము. అవసరమున్న వారి ఆర్తిని చూచి దానధర్మాలు చేస్తాము.
యోగ్యులైన వారికిచ్చే గుప్తదానాలు మమ్మల్ని తరింపజేస్తాయి. ఈ విధంగా మా ఉజ్జీవన విధములను తెలుసుకొని, ఆచరిస్తాము. మాధవసేవగా, సర్వప్రాణి కోటి సేవ చేస్తాము. "నేను, నాది" అనే స్వార్ధభావాలు తొలగించుకొని, అంతా భగవంతుడిది, భాగవతులది, కర్తవ్యం నెరవేర్చడమే నా ధర్మము అని ఆచరణకు పూనుకుంటాము.
ఈ పది నియమాలు కేవలం ఈ శ్రీవ్రత కాలం నెల రోజులే కాకుండా, జీవితాంతం పాటించే విధంగా, ఈ సిరినోమును నిత్య వ్రతంగా అలవాటు చేసుకుంటే మన జీవితం ధన్యం అవుతుంది.
*శుభంభూయాత్*