హైద్రాబాద్, విజయవాడ, జూలై 22,
ప్పటిదాకా జీతాలు తక్కువైనా వారి జీవితాలు సాఫీగానే సాగుతున్నాయి. అతికొద్ది జీతంతోనే సరిపెట్టుకొని పొదుపుగా జీవిస్తూ జీవనయానం కొనసాగిస్తున్నారు. వీరే ప్రయివేటు విద్యాసంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సాధారణ సిబ్బంది. ‘గొడ్డుచాకిరీ’ అనే పదానికి వీరు చిరునామా. అందరు ఉద్యోగులకు 8 పనిగంటలైతే వీరికి మాత్రం 12-నుంచి 14 గంటలు. వారాంతపు సెలవులు పొందడం గగనం. ఆదివారాలు ఇంట్లో ఉన్నా అప్పగించిన పని పిడుగులు పడ్డా పూర్తి చేయాల్సిందే. వీరు చేసే ప్రతీ పనికి వారి జీతాలతో ముడిపెడతాయి యాజమాన్యాలు. సంవత్సరమంతా పనిచేసినా వీరికి జీతాలు వచ్చేది కేవలం పది నెలలు మాత్రమే. ఎండాకాలం రెండు నెలలు ఫీజులు వసూలు చేయమనే సాకుతో యాజమాన్యాలు వీరికి విధిస్తున్న కోత ఇది. ఇక అడ్మిషన్లు జరిగే సమయాల్లో వీరి పరిస్థితి వర్ణనాతీతం. ఈ ఉపాధ్యాయులకు బిజినెస్ ఏజంట్ల మాదిరిగా టార్గెట్లు ఇస్తారు. ఈ లక్ష్యాలను చేరులేకపోతే జీతం కట్. ఇలా చెప్పుకుంటూపోతే వీరి కష్టాలు పగవాళ్లకు వద్దురా బాబు అనిపిస్తుంది. టూకీగా ఇదీ మనకు ఓనమాలు దిద్దించిన ఉపాధ్యాయుల పరిస్థితి.ఇదంతా ఒకఎత్తైతే కరోనా మహామ్మారితో మొదలైన లాక్‌డౌన్ వీరిపాలిట అశనిపాతంలా తయారైంది. వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించే పనిలో పూర్తిగా నిమగ్నమైఉన్న విద్యాసంస్థల యాజమాన్యాలు ఒక్కసారిగా తమ లెక్కలు తిరగబడటంతో మానవత్వాన్ని మరిచారు. పనిచేసినా జీతాలు ఇచ్చేందుకు మనసొప్పని యాజమాన్య ప్రతినిధులు, వారి సిబ్బంది సంక్షేమాన్ని గాలికివదిలేసి జీతాలు ఇవ్వడం మానేశారు. లాక్‌డౌన్ మార్చి23న విధిస్తే… మార్చినెల జీతం కూడా ఇవ్వకుండా ఉపాధ్యాయులను, ఉపాధ్యాయేతర సిబ్బందిని ఇబ్బందిపాలు చేయటం ఎంతవరకు సమంజసం. చిన్నపాటి ప్రయివేటు పాఠశాలలకు అలాంటి ఇక్కట్లు, వనరులు సమకూర్చుకోవడంలో సమస్యలు ఎదురవ్వడం సహజమే. కానీ ఎన్నో ఏళ్లుగా ఈ రంగంలో నిలదొక్కుకొని ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలు సైతం సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడం అత్యంత బాధాకరం. వీరిని ప్రశ్నించే వారెవరు? వీరి ఆగడాలకు అడ్డుకట్టవేసేవారెవరు?ఇలా గత 5 నెలలుగా జీతాలు రాక ఏ పనీ చేయలేక ఉపాధ్యాయులు, అధ్యాపకులు నానావెతలు పడుతున్నారు. ఇంటి అద్దె బాకీలు రేపో మాపో కడతామని ఓనర్లను ఒప్పించగలిగినా… ఐదువేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఇటు ఆంధ్ర కానీ… అటు తెలంగాణ ప్రభుత్వాలు వీరి కష్టాలను పట్టించుకొన్న దాఖలాలు లేదు. ఆటోవాళ్లకు, ఇతర కులవృత్తుల వారిని ఆదుకొన్నా… ప్రయివేటు విద్యాసంస్థల సిబ్బంది వారి ఎజెండాలో లేదు.ఎలాగైనా సోషల్ మీడియా ద్వారా పాలకుల దృష్టికి తమగోడు విన్నవించేందుకు చేసే ప్రయత్నాలకు విరామం లేదు. ఇలాంటి ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వకపోతాయా అన్న ఒకేఒక ఆశతో పైకి కనిపించని ఈ బడుగుజీవులు విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు… ఉంటారు. ఇందులో భాగమే మనందరం సోషల్ మీడియాలో చూస్తున్న వీడియోలు, పోస్టింగ్‌లు. ఒక ప్రయివేటు విద్యాసంస్థలో పనిచేసే అధ్యాపకుడు అరటిపండ్ల తోపుడు బండితో కనీసం బతికి ఉండేందుకు చేస్తున్న ప్రయత్నం. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో వీక్షించిన కొందరు పూర్వవిద్యార్ధులు తమకు విద్యాబుధ్దులు నేర్పించిన టీచర్ దుస్థితిని చూసి చలించి… చందాలువేసుకొని ఆ అధ్యాపకుడిని ఆదుకొన్న ఘటన ఇంకా ప్రతిఒక్కరి స్మృతిపథంలో మెదులుతూనే ఉంది. చాలామంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు హాకర్లుగా, రోజు కూలీలుగా మారుతున్నారంటే ఎవర్ని నిందించాలి. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి రుసుములు తీసుకొంటున్న సంస్థలు తమ సిబ్బందిని తగ్గించేస్తున్నాయనేది వాస్తవం. ఈ వ్యవస్థలో మార్పు తేవాలంటే ఏం చేయాలి. మనమేం చేయాలి?