YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మరో వైసీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు

మరో వైసీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు

గుంటూరు, జూలై 22, 
సీపీ నేతలు ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఈమధ్య భారీ బంగారం సీజ్ విషయంలో మంత్రి బాలినేనిపై ఆరోపణలు వచ్చాయి. ఆయన కారు పాస్ మీద ఎవరో బంగారు వ్యాపారి బంగారు తరలించడం వివాదం రేపింది. తర్వాత దానికి తానే బాధ్యుడిని అని వ్యాపారి తెలిపారు. ప్రస్తుతం గుట్కా ఫ్యాక్టరీ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా పేరు వినిపిస్తోంది. కరోనా ప్రారంభ సమయంలో వివాదాస్పదమైన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా గుట్కా తయారీకి సంబంధించి గిడ్డంగుల వ్యవహారంలో చిక్కుకున్నారు. ఆయనకు చెందిన గిడ్డంగుల్లో భారీ ఎత్తున నిషేధిత గుట్కా తయారవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
గుంటూరు ఎస్పీ ఆ గిడ్డంగుల వద్దకు వెళ్లి గుట్కా తయారీ మిషనరీని పరిశీలించారు. ఆయన స్వయంగా మీడియాతో అవి ఎమ్మెల్యేకు చెందిన గిడ్డంగులను తేల్చి చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫాకు పెదకాకాని మండలం కొప్పురావూరులో పొగాకు గిడ్డంగులున్నాయని… వీటిని ఆయన ముఖ్య అనుచరుడు, సంగడిగుంటకు చెందిన మద్దిరెడ్డి సుధాకర్‌రెడ్డి 2017లో లీజుకు తీసుకున్నారు.ఆయన ఆర్‌ఎన్‌కే ఇండస్ట్రీస్‌ పేరుతో పాన్‌ మసాలా తయారీకి లైసెన్స్‌ తీసుకున్నారని ఎస్పీ వివరించారు. పాన్‌ మసాలా ముసుగులో టెంపర్‌ లేబుల్‌ పేరుతో నిషేధిత గుట్కాను తయారు చేస్తున్నారని ఎస్పీ వివరించడంతో విపక్షాలు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ గుట్కాలను రాష్ట్రంలో విక్రయించడంతోపాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు ఎగుమతి చేస్తున్నారు. పెదకాకాని వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీ 07 బీవై 3330 కారులో పెద్ద ఎత్తున గుట్కాను గుర్తించారు. దీంతో కారును, గిడ్డంగి సూపర్‌వైజర్‌ విజయసింహలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో పొగాకు గిడ్డంగుల్లో గుట్టుగా సాగుతున్న గుట్కాల తయారీ వెలుగులోకి వచ్చిందని అర్బన్‌ ఎస్పీ వివరించారు. ఈ దాడుల్లో సుమారు రూ.కోటి విలువచేసే మిషనరీ, రూ.10 లక్షల విలువైన ముడిసరుకు, రూ.2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.దీనిపై ఎమ్మెల్యే ముస్తఫా స్పందించిన తీరు సంచలనంగా మారింది. కొప్పురావూరులో తనకు పలు గిడ్డంగులు ఉన్నమాట వాస్తవమేనని, పోలీసులు సీజ్‌ చేసిన గిడ్డంగి కూడా తనదే అయి ఉండవచ్చునన్నారు. తన దగ్గర లీజుకు తీసుకున్న వారు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారో తనకు తెలియదని చెప్పడం కొసమెరుపు.అధికార పార్టీ ఎమ్మెల్యే గోదాముల్లో గుట్కా సరుకును పోలీసులు స్వాధీనం చేసుకోవటం..ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది. పాన్ మసాలా పేరుతో అంతరాష్ట్ర వ్యాపారం చేస్తున్నట్లు చెబుతూ నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ముస్తఫా గోడౌన్ల వ్యవహారం గుంటూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

Related Posts