YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నామినేటెడ్ పోస్టులు పై ఆశలు

నామినేటెడ్ పోస్టులు పై ఆశలు

విజయవాడ, జూలై 22, 
నామినేటెడ్ పదవులు అంటే ఓ విధంగా పార్టీలో ఉన్న రాజకీయ జీవులకు భుక్తి కోసమేనన్నది అందరి నిశ్చితాభిప్రాయం. వాటి వల్ల జనానికి కలిగే మేలు కంటే ఖర్చు ఎక్కువ. రాజకీయంగా పార్టీలు లాభపడడానికి, అధికార పార్టీ పట్టు పెంచుకోవడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. గతంలో చంద్రబాబు హయాంలో కూడా నామినేటెడ్ పదవుల గోల ఒక్క లెక్కన ఉండేది. ఇపుడు జగన్ అధికారంలోకి వచ్చాక కూడా ఆశాజీవులు మాకేదీ అంటూ ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఒక ఏడాది వేగంగా గడచిపోయింది. దాంతో అధికారం అనుభవించే బంగారం లాంటి చాన్స్ కాలగర్భంలో కలసిపోయిందని వైసీపీలో మధనం మొదలైంది.నిజానికి జగన్ కి కూడా పార్టీలో తనతో పాటు భుజం కలిపి పనిచేసిన వారికి న్యాయం చేయాలని ఉంది. ఆయన అన్నీ సర్దుకుని పనిమంతులకు పదవులు పంచుదామని అనుకున్నారు. కానే ఇక్కడ వైసీపీ నేతల బ్యాడ్ లక్కే గట్టిగా పనిచేసినట్లుంది. అందుకే అవి ఊరించి మరీ అందనంత ఎత్తుకు వెళ్ళి కూర్చున్నాయి. తొలి ఏడాదిలో వైసీపీ సర్కార్ చేయల్సిన పనులన్నీ జగన్ యాక్షన్ ప్లాన్ గా పెట్టుకున్నారు. అందులో నామినేటెడ్ ఖాళీల భర్తీ ఒకటి. అయితే దీనికి ముందున లోకల్ బాడీ ఎన్నికలు జరగాలన్నది జగన్ ప్లాన్. అదే గీటురాయిగా తీసుకుని అర్హులను అందలం ఎక్కించాలని జగన్ ఆలోచించారు. అనేక కారణాల వల్ల లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దాంతో నామినేటెడ్ పోస్టులు కూడా చిటారుకొమ్మకు చేరాయి.ఇక టీడీపీ వారు అయినా వైసీపీ నేతలు అయినా ఇపుడు తన అదృష్టం ఇలా ఉందని ఇపుడు తాపీగా కూర్చుని తిట్టుకుంటున్నారు. నాడు చంద్రబాబు కూడా అన్ని ప్రాంతాలకు పదవులు పంచిపెట్టి విశాఖకు వచ్చేసరికి చేతులెత్తేశారు. దానికి ఇద్దరు మాజీ మంత్రులు కారణం. గంటా శ్రీనివాసరావుకు, అయ్యన్నపాత్రుడుకి పడకపోవడం వల్ల ఇద్దరూ రెండు లిస్టులు తెచ్చి ఇవ్వడంతో ఎవరికీ కాకుండా నామినేటెడ్ పదవులను అలా బాబు పక్కన పెట్టేశారు. ఇపుడు కూడా సేమ్ సీన్. వైసీపీలో కూడా వర్గాలు చాలా ఉన్నాయి. దాంతో ఒకరికి ఇస్తే మరొకరు రచ్చ చేస్తారు. అది లోకల్ బాడీ ఎన్నికల మీద పడి అసలుకే ఎసరు వస్తుందని వైసీపీ అధినేత జగన్ పదవుల పంపిణీ చేపట్టడం లేదని అంటున్నారు.ఇవన్నీ ఇలా ఉంటే పదేళ్ళుగా పార్టీ జెండా పట్టిన వారికి పార్టీలో న్యాయం జరగలేదన్న వాదన ఒకటి వైసీపీలో వినిపిస్తోంది. ఎన్నికల ముందు చేరిన మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ ఓడినా కూడా ప్రతిష్టాత్మకమైన వీఎమ్ ఆర్డీయే చైర్మన్ పదవిని కట్టబెట్టారని, అదే మరో కీలక‌మైన సింహాచలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ షిప్ లను కూడా ఇతర జిల్లాల వారికి ఇచ్చేసి స్థానికులు, పనిచేసే నాయకులుగా ఉన్న వైసీపీ నేతలను పక్కన పెట్టారని కూడా పార్టీలో బాధ ఉంది. ఇక ఈ మార్చిలో లోకల్ బాడీ ఎన్నికలు అనుకున్నట్లుగా జరిగితే తరువాత పదవులు వచ్చేవని, ఇపుడు దాంతో లింక్ పెట్టడం వల్ల ఎన్నికలు ఎపుడు జరుగుతాయో తెలియదు, పదవులు అంతకంటే తెలియదు అని వైసీపీ నేతలు వైరాగ్యం ప్రకటిస్తున్నారు. అయితే వైసీపీ ఉత్తరాంధ్రా ఇంచార్జి విజయసాయిరెడ్డి మాత్రం అందరికీ న్యాయం చేస్తామని చెబుతున్నారు. పదవులు పనిచేసేవారికే వస్తాయని, లోకల్ బాడీలో సత్తా చూపిన వారికే ఇస్తామని అంటున్నారు. అంటే లోకల్ ఎన్నికలు ఎపుడు జరిగితే అపుడే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తారన్న మాట.

Related Posts