హైదరాబాద్ జూలై 22,
లంకాధీశుడైన రావణాసురుడు విమానయానం చేసినట్లు చరిత్ర చెబుతున్నది. అయితే రావణాసురుడు గగనతలంలో ఎక్కడెక్కడి వెళ్లారో ఆ రూట్లను అధ్యయనం చేయనున్నట్లు శ్రీలంక ప్రభుత్వం పేర్కొన్నది. ఆ దేశానికి చెందిన విమానయానశాఖ దీనిపై పరిశోధన చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే లంకా నగర ప్రభువుకు సంబంధించిన సమాచారాన్ని తమకు ఇవ్వాలంటూ విమానయాన సంస్థ ప్రజలను ఉద్దేశిస్తూ ఇటీవల ఓ ప్రటకన చేసింది. రావణాసురుడు ప్రయాణించిన ఆకాశమార్గాలపై తాము అన్వేషణ చేయనున్నామని, దానికి సంబంధించిన సమాచారం ఉంటే తమకు ఈవెయిల్, ఫోన్ చేయాలని శ్రీలంక విమానయాన శాఖ ఆ యాడ్‌లో పేర్కొన్నది. రావణుడి విమానయానం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయని, వాటిని క్రోడీకరించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు ఓ అధికారి తెలిపారు. వేల సంవత్సరాల క్రితం శ్రీలంకను రావణాసురుడు ఏలినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే రావణుడు అనేక గగన మార్గాల్లో విమాన ప్రయాణం చేసినట్లు కూడా కథలు ఉన్నాయి. ఆ మార్గాలను తెలుసుకునేందుకు స్టడీ చేపట్టినట్లు సివిల్ యేవియేషన్ అథారిటీ అధికారి ఒకరు చెప్పారు. భారత్ నుంచి వస్తున్న పర్యాటకులకు శ్రీలంకలో రామాయణ సంబంధిత ప్రదేశాలను చూపిస్తుంటారు.