చెన్నై జూలై 22,
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలైన నళిని శ్రీహరన్ ఆత్మహత్యాయత్నం చేసింది. తమిళనాడులోని వేలురు జైలులో మంగళవారం ఉదయం ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. గమనించిన జైలు సిబ్బంది ఆమెను దవాఖానకు తరలించారు. ఈ విషయాన్ని నళిని లాయర్ పుహళేంది తెలిపారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న నళిని ఇటీవల పెరోల్‌పై కుమార్తె హరిత వివాహం కోసం ఆరు నెలలపాటు బయటకు వెళ్లి వచ్చింది. రాజీవ్ హత్య కేసులో దోషిగా తేలిన నళిని 29 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతోంది. బెయిల్ కోసం గతకొంత కాలంగా ప్రయత్నాలు చేస్తుంది. రాజీవ్ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.కాగా తోటి ఖైదీకి, నళికి మధ్య జైలులో గొడవ జరిగిందని, దీంతో ఆ మహిళ విషయాన్ని జైలర్ దృష్టికి తీసుకెళ్లిందని పుహళేంది తెలిపారు. ఆ వెంటనే నళిని ఆత్మహత్యకు యత్నించినట్టు పేర్కొన్నారు. అయితే, గతంలో ఎప్పుడూ నళిని ఇలా చేయలేదని, ఇందుకు గల కారణాలు తెలుసుకుంటామన్నారు. విషయం తెలిసిన నళిని భర్త తనను పిలిచి ఆమెను పుళల్ జైలుకు తరలించేలా చూడాలని కోరారు. ఈ విషయమై త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పుహళేంది తెలిపారు.