YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*భగవంతునికి ఇష్టమైన వారు...*

*భగవంతునికి ఇష్టమైన వారు...*

"గురు వేదాంత వాక్యాదిషు విశ్వాసః శ్రద్ధ" - అన్నారు. గురువుపట్ల, శాస్త్రం పట్ల నిజమైన విశ్వాసమే శ్రద్ధ. దానివల్లనే జ్ఞానలాభం కలుగుతుంది. గురువు మీద నిజమైన విశ్వాసం ఉంటే శాస్త్రం మీద కూడా చెక్కుచెదరని విశ్వాసం కుదురుతుంది.
కనుక ఇక్కడ భక్తుడైనవాడు భగవంతునిపై అచంచల విశ్వాసం కలిగి ఉండాలి.
తాను భగవంతునిపై భక్తిని కలిగి ఉంటే భగవంతుని అనుగ్రహం తనకు కలుగుతుందనే విశ్వాసం ఉండాలి.
1.భగవంతుడున్నాడనే విశ్వాసం,
2.ఆయన తన ప్రార్థనను ఆలకిస్తాడనే విశ్వాసం,
3.తనపై ఆయన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడనే విశ్వాసం భక్తునికి ఉండాలి.
ఈ ప్రకారంగా సగుణోపాసన ఐనా, నిర్గుణోపాసన ఐనా ఈ మూడు జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటివాడే శ్రేష్ఠభక్తుడు, యుక్తతముడు అని భగవంతుని అభిప్రాయం.
గృహస్థు - సన్యాసి అనిగాని, బ్రాహ్మణుడు - శూద్రుడు అనిగాని, సగుణోపాసకుడు - నిర్గుణోపాసకుడు అనిగాని - వీటితో ఏ సంబంధము లేకుండా ఎవరైతే ఈ మూడు జాగ్రత్తలు తీసుకొని ఉపాసన చేస్తే అతడే శ్రేష్ఠభక్తుడు.
ఉపాసన అంటే ఉప + ఆసన = సమీపంలో కూర్చొనుట. ఎవరి సమీపంలో కూర్చోవాలి? భగవంతుని సమీపంలో.
మన మనస్సు సంసారంలో కూర్చుంది. ఈ మనస్సును ఇక్కడి నుండి మకాం మార్చి భగవంతుని సమీపంలో కూర్చోబెట్టాలి. శిశువు గర్భంలో ఉన్నప్పుడు వాని చుట్టూ తల్లి శరీరమే ఉంటుంది. బయటకు వచ్చిన తరువాత ఆమె పాలు త్రాగి పెరుగుతుంది. ఆ తల్లిపాలను వేడి చేయనక్కరలేదు, పంచదార కలపనక్కర లేదు.
ఆ తరువాత ఆటబొమ్మలను మరిగి తల్లికి దూరమవుతాడు. ఆకలి కాగానే ఆటబొమ్మలను ఆవలకు నెట్టి తల్లి చంకనెక్కుతాడు.
ఇప్పుడు ఆ తల్లిపాలే కావాలి. ఆటబొమ్మలతో ఆకలి తీరదు.
అలాగే తనస్థితికి, గతికి ఆధారమైన పరమాత్మను మరచి, మనం ప్రాపంచిక వస్తువులపై మోహం పెంచుకుంటాం. భార్య అని, భర్త అని, బిడ్డలని, ఇళ్ళూవాకిళ్ళని, ధనమని, సొమ్ములని - ఈ ఆటబొమ్మలను చూసి మురిసిముప్పందుమౌతాం.
కాని ఇవన్నీ తోలుబొమ్మలు. ఎప్పుడో ఒకప్పుడు దూరమయ్యేవి, దుఃఖాన్నిచ్చేవి. వీటిలో నిత్యసుఖం లేదు. నిరతిశయానందం లేదు.
తల తిరిగి నోటికి వచ్చినప్పుడు గాని 'నీవే తప్ప నితః పరం బెరుగ' నని భగవంతుని ఆశ్రయించం.
కనుక ఇలా కష్టం వచ్చినప్పుడు గాక నిత్యము భగవంతుని ఉపాసించాలి.
విషయాధీనమైన మనస్సు భగవదాధీనం కావటమే ఉపాసన. అట్టి భక్తుడే శ్రేష్ఠుడని భగవంతుని తీర్మానం. 
-----శ్రీ  చలపతిరావు గారి ప్రవచనాల నుండి

Related Posts