YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఈ-పాస్‌తో ఇక్కట్లకు చెక్!

ఈ-పాస్‌తో ఇక్కట్లకు చెక్!

రేషన్ సరకులు పక్కదోవ పట్టకుండా లబ్ధిదారులకే అందేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఈ-పాస్ విధానాన్ని అమలు చేస్తోంది. అంతేకాక లబ్ధిదారులు సొంత ఊళ్లోనే కాక వారు బస చేస్తున్న ప్రాంతం నుంచీ రేషన్ పొందే సౌకర్యం కల్పించింది. దీంతో అనేకమందికి అవస్థలు తప్పడంతో పాటూ రవాణా చార్జీల భారం సైతం తగ్గిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కార్డు ఉన్నచోటనే సరకులు తీసుకోవాలన్న నిబంధనను మార్చింది సర్కార్. లబ్ధిదారుల నివాసానికి ఏ దుకాణం దగ్గరగా ఉంటుందో అక్కడికి వెళ్లి బియ్యం తీసుకునే వెసులుబాటు లభించింది. ఈ సేవలతో జిల్లా వాసులతో పాటు ఇతర జిల్లాలవారు ఎక్కడ ఉంటే అక్కడే సరకులు తీసుకుంటున్నారు. రెండువారాల వ్యవధిలో 10,470 మంది కార్డుదారులు ఈ తహా సేవలను వినియోగించుకున్నట్లు సమాచారం. పోర్టబిలిటీ సేవలు వినియోగించుకోవడం వల్ల కార్డుదారులకు దూరభారంతో పాటు ఆర్థికంగా కలిసొచ్చింది.

ఆదిలాబాద్‌ పట్టణంలోనే దాదాపు 43 దుకాణాలు పోర్టబిలిటీ సేవలు అందిస్తున్నాయి. దీంతో ఈ దుకాణాల్లో కార్డుదారులు సేవలను వినియోగించున్నారు. ఫలితంగా 4,335 వరకూ లావాదేవీలు జరిగాయి. వారంతా కార్డు కలిగిన దుకాణంలో కాకుండా తమకు సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లి బియ్యం తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా పోర్టబిలిటీ సౌకర్యంతో ఈనెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు 10,470 మంది 3200 క్వింటాళ్ల బియ్యం తీసుకున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా 355 దుకాణాలు ఉంటే 271 దుకాణాల్లో పోర్టబిలిటీ సేవలను కార్డుదారులు వినియోగించుకున్నారు. మొదట్లో  వేలిముద్ర వేస్తేనే బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో తొలి మాసంలో వేలిముద్రలు పడక.. కార్డు ఒకచోట మనుషులు మరోచోట ఉండటంతో చాలా మంది రేషన్ తీసుకోలేకపోయారు. ఈ సమస్య గ్రహించి ఉన్నచోటనే రేషన్‌ తీసుకునేలా పోర్టబిలిటీ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో జిల్లావాసులు వేరే జిల్లాలో ఉన్నవారితో పాటు.. ఇతర జిల్లాల నుంచి జిల్లాకు వలస వచ్చిన వారికి రేషన్‌ సరుకులు తీసుకునే అవకాశం దక్కింది.

Related Posts