YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డ సాధించేసినట్టేనా

నిమ్మగడ్డ సాధించేసినట్టేనా

విజయవాడ, జూలై 23, 
నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయ పోరాటం చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిని దక్కించుకున్నారు. ఈ సమయంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంతో ఇక ముఖాముఖి తలపడలేని వైరాన్ని సృష్టించుకున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వచ్చే ఏడాది మార్చి వరకూ పదవీ కాలం ఉంటుంది. అంటే మరో ఎనిమిది నెలల పాటు ఆయన రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉంటారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు సహకరిస్తుందా? లేదా? అన్నదే ప్రశ్న.నిజానికి గవర్నర్ ఆదేశాల్లోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విధులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ఎన్నికల అధికారికి స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తప్ప ఎలాంటి పని ఉండదు. ఐదేళ్ల కొకసారి జరగాల్సిన స్థానికసంస్థల ఎన్నికలను సకాలంలో జరపడమే. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాల్సి ఉంటుంది. ఎన్నికల తర్వాత ఆ పదవికి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు.ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో ఎనిమిది నెలల్లో తన పదవి నుంచి దిగిపోతున్నారు. కరోనా సమయంలో ఇప్పుడు ఎన్నికలు జరిపే పరిస్థితి లేదు. ఏపీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు మరో ఆరునెలలు వరకూ జరిగే అవకాశం లేదు. స్థానిక సంస్థల ఎన్నిలకు జరిపించాలన్నా రాష్ట్ర ఎన్నికల అధికారికి ప్రభుత్వ సహకారం అవసరం. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్యాక్షన్ ప్రభుత్వం నడుస్తుందని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.
అదేసమయంలో బీజేపీ నేతలతో ఒక ప్రయివేటు హోటల్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు జరిపేందుకు ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించే అవకాశం ఉండదు. గతంలో ఐఏఎస్, ఐపీఎస్ లపై చర్యలు తీసుకోమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించినా ప్రభుత్వం లైట్ గా తీసుకుంది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎనిమిది నెలల పాటు బెజవాడలో కాలక్షేపం చేసి వెళ్లాల్సిందేనని అధికార పార్టీ నుంచి విన్పిస్తున్న వ్యాఖ్యలు. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి బాధ్యతలను చేపట్టినా ప్రత్యేకంగా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదంటున్నారు. కానీ ప్రభుత్వం పరువు కోల్పోయిందన్నది మాట మాత్రం వాస్తవం.

Related Posts