YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ద్రోణంరాజు ఫ్యామలీతో జగన్ బంధం

ద్రోణంరాజు ఫ్యామలీతో జగన్ బంధం

విశాఖపట్టణం, జూలై 23, 
ఒక్కోసారి రాజకీయ బంధాలు కూడా గొప్పగా ఉంటాయి. వాటిలో కూడా ఎమోషన్లు బాగా పండుతాయి. సెంటిమెంట్లు సెంటీమీటర్ కూడా లేని పాలిటిక్స్ లో ఇంకా అనుబంధాలు ఆవకాయ కబుర్లు వద్దు అన్న వారికి కొన్ని చిత్రమైన బంధాలు అర్ధం కావేమో. విశాఖ జిల్లా వరకూ వస్తే సీనియర్ మోస్ట్ లీడర్ దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ. ఆయన వైఎస్సార్ కి ఎంతో సన్నిహితుడు. ఇద్దరూ కూడా చాలా కాలం పార్లమెంట్ సభ్యులుగా కలసి మెలసి తిరిగారు. వైఎస్సార్ ని చనువుగా రాజా అని పిలిచే పిలుపు ద్రోణంరాజు సొంతం. ఇక వైఎస్సార్ ముఖ్యమంత్రి అయితే ద్రోణంరాజు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి ఇవ్వాలనుకుంటూండగానే మరణించారు. కట్ చేస్తే ఆయన రాజకీయ వారసుడుగా కుమారుడు ద్రోణంరాజు శీనివాస్ కి రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ తరఫున ఇచ్చి గెలిపించుకున్న మంచితనం వైఎస్సార్ ది.ఇక కాంగ్రెస్ లోనే తాను ఉంటానని 2014 సమయంలో ద్రోణంరాజు శ్రీనివాస్ గట్టిగా చెప్పడంతో ఆయన్ని ఎవరూ ఏమీ అనలేకపోయారు. ఆ దశలో కూడా జగన్ ఆయనకు నేరుగా కబురు పెట్టి పార్టీలో చేరమని కోరారు. భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. అయితే కాంగ్రెస్ కమిట్మెంట్ బలంగా ఉన్న కుటుంబమని చెప్పి ద్రోణంరాజు శ్రీనివాస్ సున్నితంగా తిరస్కరించారు. ఇక 2019 ఎన్నికల వేళ మాత్రం జగన్ పిలుపు అందుకుని ద్రోణంరాజు శ్రీనివాస్ వైసీపీలో చేరారు, విశాఖ సౌత్ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడారు. దానికి వైసీపీ నేతల వెన్నుపోటు కారణమని గ్రహించిన జగన్ ఆయన్ని వెంటనే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీకి చైర్మన్ గా నియమిస్తూ క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చారు.ఇపుడు ద్రోణంరాజు శ్రీనివాస్, జగన్ ల బంధం కూడా అచ్చం వైఎస్సార్, పెద్దయన ద్రోణంరాజు మాదిరిగానే సాగుతోంది. జగన్ అంటే శ్రీనివాస్ కి ప్రత్యేకమైన అభిమానం. ఇక ద్రోణంరాజు శ్రీనివాస్ నిబద్ధత నిజాయతీ అంటే జగన్ చాల ఇష్టపడతారు. అవినీతికి ఆస్కారం లేకుండా తనకు ఇచ్చిన పదవిని ఏడాది పాటు శ్రీనివాస్ చాలా పధ్ధతిగా నిర్వహించారు, తన సమర్ధత చాటుకున్నారు. జగన్ కూడా శ్రీనివాస్ మీద నమ్మకంతో విశాఖ సిటీ అభివ్రుధ్ధి ప్రణాళికలను ఆయనకే అప్పగించారు. ఇపుడు ఏడాది పదవీ కాలం ముగిసింది. దాంతో ద్రోణంరాజు శ్రీనివాస్ పదవి కోసం వైసీపీలో పలువురు పోటీ పడుతున్నారు.ఈ పైరవీలు, ప్రయత్నాలు ఎలా ఉన్నా జగన్ మాత్రం ద్రోణంరాజు శ్రీనివాస్ కే ఓటు చేశారు. మరో మారు చైర్మన్ పదవిని ఆయనకే అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. విశాఖను రాజధాని చేయడానికి డిసైడ్ అయిన వేళ వీఎంఆర్డీయే పదవి చాలా కీలకం, ముఖ్యం. దాంతో ఈ పదవిలో ద్రోణంరాజు శ్రీనివాస్ వంటి నిజాయతీపరుడే ఉండాలని జగన్ గట్టిగా కోరుకుంటున్నారుట. దాంతో ఆయనకే మళ్లీ ఈ పదవి రెన్యూవల్ అవుతోంది. మొత్తానికి వైఎస్ కుటుంబంతో రెండవ తరంలో కూడా రాజకీయ బంధాన్ని పెనవేసుకున్న ఘనత ద్రోణంరాజు శ్రీనివాస్ దే అని చెప్పాలి. అలాగే తన తండ్రి వైఎస్సార్ మాదిరిగానే ద్రోణం రాజు ఫ్యామిలీ పట్ల అభిమానం చాటుకోవడం ద్వారా జగన్ కూడా భేష్ అనిపించుకున్నారు. వీటిని చూసినపుడు రాజకీయాల కంటే కూడా బంధాలు గొప్పవేమో అనిపించకమానదు.

Related Posts