గుంటూరు, జూలై 23,
రాజధాని అమరావతి పరిధిలో భూముల క్రయవిక్రయాలు పూర్తిగా స్తంభించాయి. రాజధాని గ్రామాల్లో 29 గ్రామాల పరిధిలో 2015 నుంచి 2019 వరకు మెట్ట భూమి ఎకరం రూ.కోటిన్నర వరకు పలకగా, 2020 నుంచి రూ.50 లక్షలకు కూడా కొనే నాథుడు లేడు. బహుళ పంటలు పండే జరీబు భూముల ధర ఎకరం రెండున్నర కోట్ల వరకు గతంలో పలకగా, ఇప్పుడు కోటి రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు. 2015 నుంచి 2019 వరకు రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. ఆ సమయంలో భూముల క్రయవిక్రయాల ద్వారా ఏటా రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఇంతవరకూ రూ.1.90 కోట్ల మాత్రమే ఆదాయం వచ్చింది. పరిపాలన రాజధాని మార్పు ప్రకటనలో 2019 డిసెంబర్ 17వ తేదీ నుంచి ఈ ప్రాంతంలో పూర్తిగా క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. గతంలో రోజుకు వంద నుంచి 300 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు, ఇప్పుడు రోజుకు ఒకటి కూడా జరగని పరిస్థితి నెలకొంది. రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ భారీగా జరుగుతున్న సమయంలో అదనంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు నాలుగు, జిల్లా రిజిస్టర్ కార్యాలయం ఒకటి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కార్యాలయాలను ఉంచాలా? ఎత్తివేయాలా? అని అధికారులు ఆలోచిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయాయి. కొంతమంది బోర్డులు మార్చి ఇతర వ్యాపారాల వైపు దఅష్టి సారించారు. అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని అప్పటి టిడిపి ప్రభుత్వం చేసిన ప్రచారంతో 2015 నుంచి 2019 మధ్య భూములు, ప్లాట్లు కొనుగోలు చేసిన వేలాది మంది ఆశలు నేడు నీరుగారిపోయాయి. భూ సమీకరణలో రైతుల నుంచి 34,724 ఎకరాల భూములను గత టిడిపి ప్రభుత్వం తీసుకుంది. ఇందులో దాదాపు పది వేల ఎకరాల్లో 29 వేల మంది రైతులకు, భూ యజమానులకు 50,389 ప్లాట్లను కేటాయించింది. వీటిని అభివఅద్ధి చేసి మూడేళ్లలో అప్పగిస్తామని సిఆర్‌డిఎ చట్టంలో పేర్కొన్నా అమలుకు నోచుకోలేదు. వైసిపి ప్రభుత్వం పరిపాలన రాజధాని మార్పుపై దఅష్టి సారించి ఈ ప్రాంత అభివఅద్ధిని పట్టించుకోవడం లేదు. భూ సమీకరణలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన వారు, రైతుల వద్ద కొనుగోలు చేసి ప్యాకేజీ ద్వారా ప్లాట్లు తీసుకున్న భూ యజమానులు తీవ్ర అయోమయంలో చిక్కుకున్నారు