విజయవాడ, జూలై 23,
రాజకీయాల్లో నాయకుల తీరు డిఫరెంట్‌గా ఉంటుంది. ఎవరు ఎలా ఉంటారో చెప్పడం కష్టం. ఒకప్పుడు పార్టీ ప్రయోజనాలు తప్ప.. నాయకులకు స్వప్రయోజనాలు తక్కువగా ఉండేవి. కానీ, కాలం మారింది.. నాయకులు కూడా పార్టీ ప్రయోజనాలకంటే.. స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది బయట పడిపోతున్నారు. పార్టీలు మారిపోతున్నారు. కానీ, కొందరు తెలివిగా.. పార్టీలు మారకుండా.. లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని, తమ సొంత పనులు చేయించుకుంటూనే.. పార్టీలో ఉన్నట్టుగా ఉంటూ.. ప్రత్యర్థిపార్టీల నేతలతో చేతులు కలుపుతున్నారు. గత పదిహేనేళ్లలో తెలుగు రాజకీయాల్లో ఈ తరహా కుళ్లు రాజకీయాలు, కుట్రలు బాగా ఎక్కువ అయ్యాయి. ఇలాంటి పరిణామం.. ఈ ఏడాది కాలంలో చాలా చోట్ల వెలుగు చూసింది.ముఖ్యంగా ఏపీలో గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో చాలా మంది నాయకులు.. తమ తమ వ్యాపారాల కోసం.. వ్యవహారాల కోసం.. కొందరు గతంలో చేసిన తప్పులు ఇప్పుడు ఎక్కడ వెలుగు చూస్తాయోనని భయంతో వైఎస్సార్ సీపీ నేతలతో కుమ్మక్కయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వారిలో ఇప్పుడు విజయవాడకు చెందిన కీలక టీడీపీ నాయకుడు కూడా చేరిపోయారని ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబుకు సీనియర్లు రిపోర్టు చేసినట్టు తెలిసింది. ఆయన విజయవాడలోని ఓ నియోజకవర్గంలో అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ.. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతుంటారు.
పార్టీ ఓడిపోయినా ఏడెనిమిది నెలల పాటు మీడియాలో ఆయన తన వాయిస్ బలంగా వినిపించడంతో పాటు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఇక గత రెండు మూడు నెలలుగా ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. దీంతో ఆయన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చే స్టార్ట్ అయ్యింది. కొన్నాళ్ల కిందట అసలు పార్టీ నుంచి బయటకు రావాలని కూడా సదరు నాయకుడు ప్రయత్నించారనే వాదన ఉంది. అయితే, ఈ నాయకుడిపై పార్టీ అధికారంలో ఉన్నసమయంలోనే సైనికుడికి సంబంధించిన భూమిని కబ్జా చేశారనే కేసు ఉంది.ఇక, ఇప్పుడు వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండడంతో ఈయన ఈ పార్టీకి చెందిన కీలక నేతతో సర్దుబాటు చేసుకున్నారని.. తనపై ఉన్న కేసులు బయటకు రాకుండా చూసుకుంటున్నారట. ఈ క్రమంలో టీడీపీకి అనుమానం రాకుండా అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి.. వైఎస్సార్ సీపీపై లేనిపోని ఆరోపణలు చేసి వెళ్తున్నారని.. దీనిపై సీనియర్లు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారం అందించారని తెలిసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. లేక సదరు నేత అంటే గిట్టని పార్టీలోని కొందరు ఇలా చేస్తున్నారా? అనే ప్రచారం కూడా ఉంది. ఈ ప్రచారం ఎలా ఉన్నా సదరు నేత సైలెంట్ అయిన మాట మాత్రం వాస్తవం.