YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

మానవత్వాన్ని చంపేస్తున్న కోవిడ్

మానవత్వాన్ని చంపేస్తున్న కోవిడ్

విజయనగరం, జూలై 23, 
కరోనా మహమ్మారి మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. ప్రతి ఒక్కరిలో ప్రాణభయాన్ని పెంచుతుంది. రోడ్డుపై కరోనా రోగులు కుప్పకూలినా..ప్రాణాలు కోల్పోయినా సాయం పట్టడం సంగతి పక్కన పెడితే కన్నెత్తి చూడటానికి కూడా జనం వణికిపోతున్నారు. కొన్ని చోట్ల కరోనాతో మృతి చెందిన రోగుల అంత్యక్రియలను సైతం అడ్డుకుంటున్నారు. దీంతో కరోనా మృతులకు తుది సంస్కారాలు నిర్వహించడం అధికార యంత్రాంగానికి కత్తి మీద సాములా తయారైంది. కరోనాతో మృతి చెందిన వ్యక్తులను పూడ్చి పెట్టేందుకు స్మశానానికి తీసుకెళ్తుంటే అక్కడి స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది.చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తి పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వస్తోంది. నిన్న మొన్నటి దాకా కరోనా తేలికగా తీసుకున్న జనం మరణాల సంఖ్య పెరగడంతో వణికిపోతున్నారు. కరోనా మృతులను తమ ప్రాంతంలో కననం చేస్తే కూడా తమకు వైరస్ సోకుతుందేమో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ సిబ్బందిపై ప్రజలు తిరగబడుతున్నారు. దీంతో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సివస్తుంది.ఇటీవల పార్వతీపురంలో కరోనా మృతదేహాన్ని స్మశానానికి తీసుకొచ్చిన మున్సిపల్ సిబ్బంది స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలు ఝులిపించి జనాన్ని చెదరగొట్టారు. దీనిపై ఆగ్రహించిన స్థానికులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్ కోటలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వేరే గ్రామానికి చెందిన మృతదేహానికి అధికారులు ఎస్ కోట స్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశారు. అయితే కరోనా మృతదేహాన్ని ఇక్కడ ఎలా పూడ్చి పెడతారంటూ అధికారులను స్థానికుల నిలదీశారు. చుట్టుపక్కల ఉన్న కుటుంబాల మహిళలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని వాదనకు దిగారునెల్లిమర్లలోనూ కరోనా రోగి మృతదేహాన్ని ఖననం చేయడానికి అధికారులు ముప్పు తిప్పలు పడ్డారు. పది రోజుల క్రితం చిత్తూరు జిల్లా వలసపల్లిలోనే ఇదే జరిగింది. ఈశ్వరమ్మ కాలనీకి చెందిన 43 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి వారం పాటు చికిత్స తీసుకున్నారు. అతడికి శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో వైద్యులు తిరుపతికి రిఫర్ చేయడంతో అక్కడకు తరలిస్తుండగా మధ్యలోనే కన్నుమూశారు.దీంతో అతడి మృతదేహాన్ని వలసపల్లిలో ఖననం చేసేందుకు బంధువులు తీసుకొచ్చారు. అయితే కరోనా సోకి చనిపోయాడన్న అనుమానంతో ఖననం చేయకుండా స్థానికులు అడ్డుకున్నారు. ఐదు గ్రామాల ప్రజలు కలిసి మృతదేహాన్ని ఊరిలోకి రాకుండా నిలువరించారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు గంటల తరబడి శవాన్ని ఊరి బయటే పెట్టుకుని నిలబడాల్సివచ్చింది. చివరకు పోలీసుల జోక్యంతో జనానికి నచ్చజెప్పడంతో అంత్యక్రియలు చేసేందుకు ఒప్పుకున్నారు.సంగారెడ్డి జిల్లా సత్యగ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో బంధువులు మృతదేహాన్ని ఆంబులెన్స్ లో సొంతూరుకు తీసుకెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. వృద్ధుడు అనారోగ్యంతో చనిపోయాడని ఆయనకు కరోనా సోకలేదని కుటుంబ సభ్యులు చెప్పినా జనం ఒప్పుకోలేదు. జనమంతా కలిసి అంబులెన్స్ ను ఊరి బయటే ఆపేశారు. గ్రామంలోకి రాకుండా రోడ్డుపై రాళ్లు పెట్టారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో ప్రయత్నించినా గ్రామస్తులు వెనక్కి తగ్గలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఊరిలోని స్మశానంలో అంత్యక్రియలు జరిగేది లేదని తేల్చి చెప్పారు. దీంతో చివరకు వ్యవసాయ భూమిలోనే వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించారు.

Related Posts