హైద్రాబాద్, జూలై 23,
తెలంగాణలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దీంతో జనాలు భయపడుతున్నారు. అదే సమయంలో కొత్త భయం పట్టుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి కారణం పాజిటివ్ ఉన్న వారికి నెగిటివ్ అని రిపోర్టులో రావడమే. కొత్తగా కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న యాంటీజెన్ పరీక్షలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వాటి ఫలితాల్లో పాజిటివ్ ఉన్న వారికి కూడా నెగిటివ్ అని వస్తోంది. దీంతో యాంటీజెన్ టెస్టులపై సందేహాలు నెలకొన్నాయి. యాంటీజెన్ టెస్టుల కన్నా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవడమే బెటర్ అని నిపుణులు అంటున్నారుయాంటీజెన్ ద్వారా చేస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షల్లో అస్పష్టత నెలకొంది. పాజిటివ్ ఉన్నా నెగిటివ్ అని వస్తోంది. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే తీవ్ర కరోనా లక్షణాలు బయటపడి బాధితుల ఆరోగ్యం విషమిస్తోంది. కొన్ని సందర్బాల్లో ప్రాణాలు పోతున్నాయి. కొందరు వ్యక్తులు రెండుసార్లు యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నా నెగిటివ్ వస్తోంది. దీంతో వారు తమకు కరోనా లేదనే నమ్మంతో స్వేచ్చగా బయట తిరుగుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత 4 రోజులకే వారి ఆరోగ్యం విషమించింది. ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష చేయిస్తే కరోనాతో పాటు నిమోనియో ఉందని, ఆసుపత్రిలో చేరకపోతే ప్రాణహాని ఉంటుందని డాక్టర్లు హెచ్చరించడంతో కంగుతింటున్నారు.ఆర్టీ-పీసీఆర్ టెస్టులతో పోలిస్తే, యాంటీజెన్ టెస్టుల ద్వారా కేవలం అరగంటలోనే వైరస్ సోకిందా? లేదా అనేది తెలుస్తుంది. అతి తక్కువ సమయంలో వైరస్ లోడ్‌ను తెలుసుకునేందుకు ఈ టెస్టులు బాగా ఉపయోగపడతాయి. ఈ కారణంతోనే ప్రభుత్వం యాంటీజెన్ టెస్టుల వైపు మొగ్గు చూపుతోంది. కానీ, యాంటీజెన్ టెస్టుల్లో కచ్చితత్వం ఉండటం లేదు. ఫలితాల్లో పారదర్శకత లేదు. పాజిటివ్ ఉన్నా నెగిటివ్ వస్తోంది. దీంతో యాంటీజెన్ టెస్టులపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.హైదరాబాద్ నగరంలో జరిగే కరోనా పరీక్షల్లో అస్పష్టత నెలకొంటోంది. 85 శాతం కచ్చితత్వంతో ఫలితాలను ఇచ్చే రివర్స్ ట్రాన్‌స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్‌టీ-పీసీఆర్) పరీక్షలను చాలావరకు తగ్గించిన అధికారులు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలనే చేస్తున్నారు. ఇవి 60 శాతం కచ్చితత్వంతో ఉంటున్నాయి. కరోనా లక్షణాలున్న వారికీ నెగిటివ్ వస్తోంది. అనుమానితులు బయట తిరుగుతూ ఇతరులకూ అంటిస్తున్నారు. రెండు రోజులకే కరోనా లక్షణాలు తీవ్రమై ఆరోగ్యం విషమిస్తోంది.కరోనా ప్రారంభమైనప్పటి నుంచి గాంధీతోపాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా ఆయుర్వేద, నేచర్‌క్యూర్ లాంటి సెంటర్లలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెద్దఎత్తున చేశారు. ఫలితం 85 శాతం వరకు కచ్చితత్వంతో ఉండటంతో చిన్నపాటి లక్షణం ఉన్నా పాజిటివ్‌గా చూపించేది. ఫలితాలు రావడానికి ఒకట్రెండు రోజులు ఆలస్యమైనా, వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య ప్రక్రియ మొదలుపెట్టడానికి ఆస్కారముండేది. తద్వారా 95 శాతం వరకు బాధితులు కోలుకొనేవారు. గత పది రోజులుగా ఆర్టీ పీసీఆర్ పరీక్షలను దాదాపు నిలిపివేశారు. కేవలం ఉస్మానియా, గాంధీ, ఫీవర్, సీసీఎంబీ, ఐపీఎం, నిమ్స్ లాంటి ఆస్పత్రుల్లోనే చేస్తున్నారు. గతంలో ఫీవర్ ఆసుపత్రిలో రోజుకు దాదాపు 100-150 పరీక్షల చేయగా ఇప్పుడు అయిదారు మాత్రమే చేస్తున్నారు. నిమ్స్‌లో వైద్యులు సిఫారసు చేసినవారికి మాత్రమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. మిగిలిన ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు ఆరేడు వేల ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. ప్రతి అనుమానితుడికి ఈ పరీక్షలు అందుబాటులో ఉంచితే కచ్చితమైన ఫలితం వచ్చి గందరగోళానికి గురికాకుండా వెంటనే వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.యాంటీజెన్ పరీక్షలో నెగిటివ్ వచ్చిన రెండు రోజులకే కరోనా లక్షణాలు తీవ్రమవుతుండడంతో అనేకమంది మళ్లీ యాంటీజెన్ పరీక్షా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడి వైద్యులు ఆర్టీ పీసీఆర్ పరీక్ష గానీ, ప్రైవేటు ల్యాబ్‌ల్లో గానీ పరీక్ష చేయించుకోండని సలహా ఇస్తున్నారు. అప్పటికప్పుడు ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకునే అవకాశం లేకపోవడంతో వందలాది మంది ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్ చేసి కరోనా ఫలితాలను ప్రైవేటు ల్యాబ్‌లు వెల్లడిస్తున్నాయి.ప్రస్తుతం భారత్‌లో కరోనా నిర్థారణకు ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్, రాపిడ్ యాంటీబాడీస్ టెస్ట్ అనే రెండు పద్ధతులను అవలంబిస్తున్నారు. రివర్స్ ట్రాన్‌స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్‌టీ-పీసీఆర్) అనేది ల్యాబ్‌లో ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏగా మార్చే ప్రక్రియ. యాంటీబాడీ టెస్టుల్లో భాగంగా వైరస్‌ను కనుగొని దానికి శరీరం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఈ పరీక్షల్లో నిర్థారిస్తారు. ఇందు కోసం రోగి శరీరంలోని శ్వాస మార్గం, గొంతు, ముక్కు నుంచి నమూనాలకు సేకరిస్తారు. వీటి ఫలితాల కోసం 12 నుంచి 24 గంటల సమయం పడుతుంది. ఇది ఎంతో ఖరీదైంది.ఈ పరీక్షల్లో ఖర్చు తక్కువ, ఫలితం కూడా కేవలం 20 నుంచి 30 నిమిషాల్లో తెలుస్తుంది. వీటిలో వైరస్‌పై ప్రతి స్పందించేదుకు వ్యక్తి శరీరంలో యాంటీబాడీలు తయారయ్యా? లేదా అనేది ఈ పరీక్షల్లో తెలుస్తుంది. ఒక వేళ యాంటీబాడీలు ఉత్పత్తి అయితే పాజిటివ్, కాకపోతే నెగటివ్ అని ఫలితాలను నిర్థారిస్తారు. ఈ పరీక్షలు ఎక్కువగా కరోనా అనుమానితులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అంటే కరోనా హాట్ స్పాట్ లుగా గుర్తింపబడిన ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కరోనా సోకినప్పటికీ యాంటీబాడీలు ఉత్పత్తవ్వని కారణంగా పరీక్షల సమయంలో నెగటివ్ వచ్చి మరి కొద్ది రోజుల తర్వాత సదరు వ్యక్తికి ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ రావడం జరిగిందని వైద్యులు తెలిపారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించిన వారిలో వైరస్ వ్యాప్తి ఈ విధంగా జరిగిందని అన్నారు.రియల్ టైం ఆర్టీ-పీసీఆర్ (రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్) టెస్టు లాగానే యాంటీ జెన్ టెస్టులకూ ముక్కు, గొంతు కలిసే చోట (నాసో ఫారింజియల్ రీజియన్) నుంచి స్వాబ్లతో శాంపిళ్లను తీసుకుంటారు. ఆర్టీపీసీఆర్‌లో వైరస్ జీన్ను గుర్తిస్తే.. ఈ యాంటీజెన్ టెస్టులో వైరస్ ప్రొటీన్ను గుర్తిస్తారు. కరోనా సోకిన తర్వాత పది నుంచి 14 రోజుల పాటు యాంటీజెన్ ప్రొటీన్ మన శరీరంలో ఉంటుంది. లక్షణాల్లేని పేషెంట్లలో పది రోజుల వరకు, లక్షణాలున్నోళ్లలో 14 రోజుల వరకూ ఉంటుంది. ఈ టెస్టులో పాజిటివ్ వస్తే వైరస్ ఉన్నట్టే లెక్క. ఒకవేళ వైరస్ లక్షణాలు ఉండి నెగెటివ్ వస్తే మాత్రం మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ గైడ్లైన్స్లోనూ తెలిపింది. కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవాళ్లకు, ఆపరేషన్లకు ముందు పేషెంట్లకు, డెలివరీలకు ముందు గర్భిణులకు, వృద్ధులకు ఈ టెస్ట్ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని సూచించింది.ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు ప్రభుత్వ ల్యాబ్స్‌లో ఉచితం అయినప్పటికీ, ప్రైవేటు ల్యాబ్‌లు వీటి కోసం రూ.4500 వసూలు చేస్తున్నాయి. అయితే ఈ పరీక్షలు ఎంత మేర ప్రభావంతంగా పని చేస్తాయనేది రోగి వైరస్ బారిన పడిన సమయం నుంచి అతడిలో వైరస్ తీవ్రత, ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాల నాణ్యత, వాటిని ఏ విధంగా ప్రాసెస్ చేశారు, పరీక్షలకు ఉపయోగించే కిట్లలోని కచ్చితత్వం వంటి పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు.