నల్గొండ, జూలై 23,
రాష్ట్రంలో మరో రెండు నెలల్లో వానాకాలం పంట రానుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈసారి కూడా భారీగా దిగుబడులచ్చే అవకాశం ఉంది. గత సీజన్‌లో కూడా ప్రభుత్వ కొనుగోళ్లు ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలోని గోదాములన్నీ నిండిపోయాయి. దీంతో ఈ వానాకాలం పంటను ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. మరోవైపు గత ఏడాది పంట నిల్వలను అమ్మడానికి కొనుగోలు సమస్యలు ఎదురవుతున్నాయి. కొవిడ్ కారణంగా మార్కెట్లు నెమ్మదించడంతో అనుకున్న ధర వచ్చే పరిస్థితులు లేవు. కొనుగోలుకూ వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో 'రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య' (మార్క్‌ఫెడ్) ఒకడుగు ముందుకేసి మక్కలను ఎలాగైనా అమ్మాలని టెండర్లు పిలిచింది. అవి అమ్ముడైతే 94.70 లక్షల క్వింటాళ్ల వరకూ బయటికి వెళ్లి గోదాములు ఖాళీ అవుతాయి.
గత యాసంగిలో ప్రభుత్వం మద్దతు ధరకు మొక్కజన్నలు, సెనగలు, వేరుసెనగ, కందులు, పొద్దుతిరుగుడు తదితర పంటలను కోటి క్వింటాళ్లకు పైగా కొనుగోలు చేసింది. ఈసారి ధాన్యం కొనుగోళ్లు కూడా అంచనాలకు మించి 65 లక్షల టన్నులకు చేరాయి. భారత పత్తిసంస్థ (సిపిఐ) 40 లక్షల బేళ్ల (బేలు 170 కిలోలు) పత్తిని కొనగా.. ప్రైవేటు వ్యాపారుల వద్ద మరో 5 లక్షల బేళ్లున్నాయి. దీంతో రాష్ట్రంలోని గోదాములన్నీ నిండిపోయాయి. ఇవి సరిపోక కొన్నిచోట్ల ఫంక్షన్‌హాళ్లు, మార్కెట్‌యార్డుల్లో పరదాలు కప్పి బస్తాలను పేర్చారు. వాటిని తక్షణం అమ్మడం లేదా ఇతర ప్రాంతాలకు తరలించడం లాంటి చర్యలు చేపట్టకపోతే వర్షాలకు తేమ వచ్చి పాడయ్యే ప్రమాదముంది. ఇదే విషయాన్ని నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు.మద్దతు ధరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్న పంటలను ఇతర ఖర్చులు కలుపుకొని కాస్త ఎక్కువ ధరకు అమ్మితేనే నష్టాల నుంచి బయటపడతాయి. కానీ కొవిడ్ దెబ్బకు వాణిజ్య అమ్మకాలు లేవని వ్యాపారులు ముందుకురావడం లేదు. ఉదాహరణకు క్వింటాకు రూ.1,760 చొప్పున చెల్లించి మార్క్‌ఫెడ్ రైతుల నుంచి మొక్కజన్నలను కొనుగోలు చేయగా.. ప్రస్తుతం మార్కెట్‌లో ధర రూ.1,500 కూడా లేదు. కనీసం క్వింటాను రూ.1,900కు పైగా అమ్మితేనే మార్క్‌ఫెడ్‌కు నష్టాలు రావు. ఈ నేపథ్యంలో ఎంత ధరకు కొంటారో తెలపాలని మార్క్‌ఫెడ్ టెండర్లను పిలిచింది. ఈ నెల 18 వరకూ గడువు ఇచ్చింది. టెండర్లలో వ్యాపారులు మరీ తక్కువ ధర కోట్ చేస్తే దాన్ని సిఎం దఅష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటారు. క్వింటాకు రూ.100 ధర తగ్గినా రూ.100 కోట్ల నష్టం వస్తుందని అంచనా. ఈ లెక్కలన్నీ తేలి పంటలన్నీ అమ్మితే తప్ప గోదాములు ఖాళీ కావు. రెండు నెలల్లోగా వాటిని ఖాళీ చేయకపోతే కొత్త పంటల కొనుగోలుకు ఇబ్బందులు వస్తాయని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. ఫంక్షన్‌హాళ్లు, ఇతర ప్రాంతాల్లో నిల్వ చేసిన పంటకు సరైన రక్షణ లేదని కొందరు కలెక్టర్లు తెలిపారని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్పారు