YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*నిత్య విద్యార్థి..*

*నిత్య విద్యార్థి..*

మానవుడు నిరంతర అధ్యయనంతో  జీవన గమనం సాగిస్తాడు.
జ్ఞానం తరగని నిధి యన్న స్పృహతో  గురువులు, అనుభవజ్ఞులు, గ్రంథాల నుండి మంచి విషయాలు గ్రహిస్తూ  జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చుకుంటాడు. 
ప్రకృతి, పంచభూతాల  స్ఫూర్తితో తనను తాను మెరుగుపరచుకుంటాడు.  నదుల ప్రవాహం, వృక్షాల జీవనం,  మేఘాలు పరుగు,  సూర్య చంద్రుల గమనాల సారం లోకహితమేనని భావించి  పరోపకారం, త్యాగభావనలు  అలవరచుకుంటాడు. 
మూగజీవుల జీవితశైలి  నుండీ  సద్గుణాలు గ్రహిస్తూ  ఉన్నత ఆలోచనలు పెంపొందించుకుంటాడు.
దత్తాత్రేయుడు ప్రకటించిన అనేక  గురువుల్లో పశుపక్ష్యాదులూ స్థానం పొందాయి.     
సింహము,  కొంగల నుండి ఒక్కో విషయం, కోడి నుండి నాలుగు, కాకి నుండి ఐదు, కుక్క నుండి ఆరు,  గాడిద నుండి మూడు సద్గుణాలు నేర్చుకోవచ్చని చాణక్యుడి సూత్రాలు బోధించాయి. 
‘సొంతబలం మీద విశ్వాసంతో  శక్తినంతా కేంద్రీకరించి  కార్యజయం పొందాలని’  సింహం,  ఏకాగ్రతతో సర్వేంద్రియాలను నియంత్రించి అనుకున్న కార్యం చక్కబెట్టాలని కొంగ,  వేకువనే మేల్కొనుట, శ్రమిస్తూ ఆహార సంపాదన, ఉదారంగా పరులకిచ్చుట, అప్రమత్తంగా మెలగటాన్ని  కోడి  బోధిస్తున్నాయి.   
సృష్టిలో ప్రతి ప్రాణికీ ప్రత్యేకత ఉందని అంగీకరించిన మానవుడు వాటిలోని సుగుణాలను గ్రహించి నడవడికను  తీర్చిదిద్దుకుంటాడు. 
శృంగారంలో గోప్యతకు కాకిని ,  తియ్యగా మాట్లాడడానికి  చిలుకను ,  శుచిగా స్నానం చేయడానికి ఏనుగును , ఆహారాన్ని  నమిలి మింగడానికి మేకను , యజమాని పట్ల  విశ్వాసానికి కుక్కను , కష్టించి పనిచేయడానికి  గాడిదను , క్రమశిక్షణ, దూరదృష్టికి  చీమలను  ఆదర్శంగా భావించి అనుసరించాలి.   
జీవితాన్ని యాంత్రికంగా, నిస్తేజంగా గడపకూడదని  సహజంగా  జరిగేవాటిని  ఆస్వాదిస్తూ సంతోషించాలని వర్షించే  మేఘాలను  చూస్తూ పురివిప్పి  నాట్యమాడే నెమలి చెబుతుంది.  పాలనూ నీరునూ వేరు చేసినట్టే మంచిచెడులను ఎరిగి ప్రవర్తించమని హంస బోధిస్తోంది.
రావణుణ్ణి  ఎదిరించి రెక్కలు తెగిన జటాయువు, పాలు సంతతి నిచ్చి  నరుల శ్రేయస్సు కాంక్షించి  గోమాత  పరోపకారం  ప్రాధాన్యత  చాటాయి. 
ఆకలి కలిగితేనే ఆహారాన్వేషణకు బయల్దేరే  పక్షులు రేపటి కోసం ఏమీ దాచుకోవద్దని, అత్యాశ వలదని బోధించాయి.
పాపభీతి విడిచి అక్రమార్జనతో ఆస్తులు అంతస్తులు నిర్మించుకున్నవారు పక్షులను చూసి సిగ్గుపడాలి.
ఆదర్శమార్గంలో నడవాలి.
ఆపదల్లో  ఆదుకోవడానికే ధనార్జన చేయాలని,  పరులను పీడించే సంపాదన హితవు కాదని, భార్యాబిడ్డలు, సంపదల్లో ఒక్కదాన్నే దక్కించుకునే సంకట స్థితిలో ధనాన్ని త్యజించి  కుటుంబాన్ని రక్షించాలన్న గ్రంథాల సారాంశాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించి ప్రశాంత జీవనం గడపాలి జనులు. 
*జై శ్రీమన్నారాయణ*

Related Posts