కామేశ్వరీ అనే నామం చాలా గొప్పది. కామ-ఈశ్వరీ లో 'కామ' అంటేనే అమ్మవారు. వేదంలో పరమేశ్వరుడికి కాముడు అని పేరున్నది. కామ, ప్రజ్ఞ, బ్రహ్మ ఇవన్ని పరమేశ్వరుడి పేర్లు అని వేదం చెప్తోంది.
పరమేశ్వరుడు తన సంకల్పం చేత విశ్వాన్ని ఏర్పాటు చేసాడు. అదే 'సత్యకామః సత్య సంకల్పః'. ఆయన అమోఘమైన కామస్వరూపుడు. ఆయన కోరికతోనే జగత్తు అంతా నడుస్తోంది. అయితే ఆ కోరిక మనలా అజ్ఞానంతో, వికారాలతో కూడిన కాదు.
సృష్టిలో కర్మలు అనుభవించవల్సిన జీవులని వారి కర్మలు వారి చేత అనుభవింపజేయడం కోసం ఒక లీలగా సృష్టిని ఏర్పాటు చేసాడు పరమాత్మ. ఆ లీలామయమైన కామస్వరూపమైన పరమేశ్వరుడే కామేశ్వరుడు. సృష్ట్యాదులు చెయ్యక ముందు కేవలం నిర్వికారంగా ఉన్న పరమాత్మ సృష్టిస్థితిలయలు చెయ్యాలని సంకల్పించుకొని కామేశ్వరుడు' అయ్యాడు. అటుతరువాత సృష్టిస్థితిలయలు చేసేటపుడు ఆయనే పరమేశ్వరుడు.
నిరాకారస్థితి లేదా నిర్గుణమైనస్థితి నుంచి సగుణమైన జగత్తుకి నడుమ ఉన్న పరమేశ్వరస్వరూపం కామేశ్వరస్వరూపం. అప్పుడు ఆయన యందు ఉన్న సంకల్పశక్తియే కామేశ్వరి. మనందరం పరమేశ్వర సంకల్పశక్తినే ఉపాసిస్తున్నాం.
కామ-ఈశ్వరి - 'కశ్చ అశ్చ మశ్చ ఇతి కామః' - 'కకారోబ్రహ్మవాదీచ అకారో విష్ణువాచకః మకారో రుద్రవాదీచ' — క-కారం బ్రహ్మ, అ-కారం విష్ణువు, మ-కారం శివుని తెలియజేస్తుంది. బ్రహ్మవిష్ణురుద్రులు - సృష్టిస్థితిలయకారకులు. ఈ ముగ్గురు స్వరూపంలో ఉన్న ఈశ్వరి, ఈ ముగ్గురుని నియమించే ఈశ్వరి కనుక కామేశ్వరి.
ఇలా భావన చేస్తే ఎటువంటి స్వరూపం గల తల్లిని మనం ఉపాసిస్తున్నామో తెలుస్తుంది. ఆ తల్లి ఉన్న క్షేత్రానికి 'అసమ క్షేత్రం' అని పేరు. అదే ఇప్పుడు అస్సాంగా చెప్పుబడుతున్నది.
భారతదేశమంతా అసేతుశీతాచలం ఋషుల భూమి. భారతదేశంలో ఎక్కడ చూసినా మనదైన వైదికభాష, వైదిక సంస్కారం కనపడుతుంది. ఈ కోణంతో పరిశీలించే మేధావులు రావాలి. కాని భారతదేశంలో పుట్టినవారందరూ పాశ్చాశ్చవిద్య వ్యామోహంలో పడి మన దేశసంస్కృతి మరిచిపోతున్నారు. మన సంస్కృతిని, సనాతనధర్మాన్ని ఎల్లవేళల రక్షించమని కామాఖ్యపీఠరూపిణైన అమ్మ కామేశ్వరిని ప్రార్థిద్దాం.
*కామేశ్వరీం చ కామాఖ్యాం కామపీఠనివాసినీం*
*తప్తకాంచన సంకాశాం తాం నమామి సురేశ్వరీం*
------పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు-