మాన్యులు అంటే గౌరవింపదగినవారు. ఉత్తములు అందరినీ మాన్యులుగానే భావిస్తారు. మాన్యతకు అర్హతలేమిటి? ధనమా, సిరి సంపదలా, జ్ఞానమా, వయసా, అనుభవమా, ఏవైనా ప్రత్యేక లక్షణాలా?
వాస్తవానికి ఇవేమీ కావు.
ప్రత్యేకతల వల్ల లభించే గౌరవం తాత్కాలికమే. ఆ ప్రత్యేకతలు తొలగిపోయినప్పుడు గౌరవం సైతం కరిగిపోతుంది.
ప్రపంచాన్ని శాసించే దిక్పాలకులు రావణుడికి బందీలైనప్పుడు, వారి ప్రాభవం అడుగంటింది. ఆంజనేయుడు విడిపిస్తే గానీ, వారికి పూర్వ వైభవం తిరిగి దఖలుపడలేదు. ఆ కారణంగానే గ్రహ దోష నివారణకు మారుతిని ఆరాధించాలంటారు.
ఎంతటివారికైనా పదవిలో ఉన్నంతవరకే పరపతి. ఆ వైభవం అంతరించగానే అంతవరకు చక్రం తిప్పినవారు సైతం సాధారణ వ్యక్తిగా మారిపోతారు. ఉత్తములకు ఈ సమస్య ఉండదు. వారి సౌజన్యం చంద్రుడి చుట్టూ వెన్నెలలా అందరినీ ఆహ్లాదపరుస్తుంది. సర్వజన ప్రియుడిగా మార్చేస్తుంది.
ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవారు అందరితోనూ ఆత్మీయంగా ఉంటారు. సమభావంతో మసలుతారు. ఇతరులు తమకు నచ్చినట్లుగా వ్యవహరిస్తూ, ఆగ్రహ అనుగ్రహాలకు వశులైై కొందరికి ఇష్టులుగా, మరికొందరికి అయిష్టులుగా మెలగుతుంటారు. మానవ సంబంధాలు ఉత్తమంగా ఉండాలనుకునేవారు ప్రయత్నించి తమ ప్రవర్తనను మార్చుకుంటారు. సాధ్యమైనంత ఎక్కువ హృదయాలకు చేరువ అవుతారు.
ఈ లోకంలో మన జ్ఞాపకాలు ఆత్మీయుల మనసుల్లో అమృత బిందువులు కావాలి. ఆత్మీయులు మన గురించి తెలియని వారికి కూడా ఎంతో ఘనంగా చెబుతారు. అదే మన కీర్తి పతాకం.
జెండా ఎవరు ఎగురవేసినా అది రెపరెపలాడుతూ కనువిందు చేస్తుంది. మంచివారి స్మృతులు సైతం అలాంటివే.
అహంకారం అగ్నిశిఖ లాంటిది. అది ప్రదర్శించినవారినే అంతం చేస్తుంది. నవనందులు- మహాజ్ఞాని, ఆత్మాభిమాని అయిన చాణక్యుడి శిఖను పట్టుకుని సభలో ఈడుస్తూ ఘోరంగా అవమానించారు. ఫలితంగా అనంతర కాలంలో వారు రాజ్యాధికారం కోల్పోయారు.
రావణుడు, వాలి తమ సోదరుల్ని దారుణంగా అవమానించి ఏ విధంగా నష్టపోయారో మనకు తెలిసిందే. ద్రౌపదిని అవమానించిన కౌరవులూ సమూలంగా నాశనమయ్యారు.
వసిష్ఠ-విశ్వామిత్రుల కథా ఇందుకు భిన్నం కాదు. వసిష్ఠుడిపై విశ్వామిత్రుడి శక్తులేవీ పని చెయ్యలేదు. అలా జరుగుతున్న కొద్దీ అవమానంతో రగిలిపోయిన విశ్వామిత్రుడు చివరకు రాజీపడ్డాడు.
ఎంతటివారికైనా- కోపం వల్ల కార్యభంగం తప్పదు. ఓర్పుతోనే కార్యసాఫల్యం లభిస్తుంది. సహనం గొప్ప శక్తి. అనేక సంవత్సరాలు కఠిన తపస్సు చేసిన పార్వతీదేవి, కనీసం ఆకుల్నీ ఆహారంగా స్వీకరించకుండా ‘అపర్ణ’ అనిపించుకుంది. మహాదేవుణ్ని పతిగా పొందింది.
చీకట్లు అంతరించగానే మనోహరమైన ఉదయం సాక్షాత్కరించినట్లు, కష్టాల తరవాత సుఖాలు వేచి ఉంటాయి. అంతవరకు నిరీక్షించాలి.
మనిషి మానావమానాలను, సుఖ దుఃఖాలను, శీతోష్ణాలను సమ దృష్టితో చూడాలంటాడు గీతాచార్యుడు. దీనినే ‘స్థితప్రజ్ఞ’ అంటారు. శ్రీకృష్ణుడు స్వయంగా స్థితప్రజ్ఞుడు.
ఆధ్యాత్మిక సోపానాలకు స్థితప్రజ్ఞ వెలుగుదారి వంటిది. మనం ఆ బాటలో నడిచే ప్రయత్నం చేద్దాం