న్యూఢిల్లీ జూలై 23
ఈశాన్య భారతదేశంలో ప్రస్తుతం రెండు సవాళ్లు ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఓ వైపు కరోనా, మరోవైపు వరదలతో ఆయా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని ఆయన చెప్పారు. గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మణిపూర్ నీటి సరఫరా ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా తీవ్రత, వరదల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.మణిపూర్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాత్రింబవళ్లు పనిచేస్తోందని మోదీ తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నదని చెప్పారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో దేశం మీ వెంట ఉంటుందని, కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.