విజయవాడ, జూలై 24,
పాలనలో మెరుపులు చూపిస్తున్న జగన్ ప్రభుత్వంపై తాజాగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబు మాదిరిగానే ఇప్పుడు జగన్ కూడా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు తన హయాంలో రాజధాని ఏర్పాటు కోసం.. అమరావతిని ఎంపిక చేసిన తర్వాత ఇక్కడి పనులను రాష్ట్రంలోను, దేశంలోనూ మేధావులు ఇంజనీర్లు లేనట్టుగా సింగపూర్, దుబాయ్ దేశాలకు చెందిన కంపెనీలకు, అక్కడి ఇంజనీర్లకు అప్పగించారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు చంద్రబాబు ఐదేళ్లలో తొలి యేడాది రాజధాని గురించి పట్టించుకోలేదు. తర్వాత రెండేళ్ల పాటు డిజైన్లు, గ్రాఫిక్స్, సినిమా సెట్టింగులు అంటూ ప్రజలను బాగానే మభ్యపెడుతూ వచ్చారు.చివరకు చంద్రబాబు వీటిని పక్కన పెట్టేసి విదేశీ కంపెనీలకు రాజధాని డిజైన్ బాధ్యతలు అప్పగించడంతో సామాన్య ప్రజల్లోనూ బాబుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ అప్పట్లో విపక్షంగా ఉన్నసమయంలో టీడీపీని బాగానే టార్గెట్ చేసింది. దేశంలో అనేక మంది కీలక ఇంజనీర్లు ఉన్నారని, వీరు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారని, అలాంటి వారిని రాజధాని కోసం నియమిస్తే.. ఖర్చు కూడా తగ్గుతుందని వైఎస్సార్ సీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వానికి సూచనలు చేశారు.అయితే, ఆయన వినిపించుకోలేదు. ఇక, ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా ఇదే చంద్రబాబు బాటలో ప్రయాణిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే, అప్పట్లో చంద్రబాబు రాజధానిని ఎంచుకుంటే.. ఇప్పుడు కీలకమైన జిల్లాల విభజన విషయం తెరమీదికి వచ్చిందని అంటున్నారు. ఇది రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యం ఉన్న అంశమని, ఒక్కసారి జిల్లాల విభజన జరిగిపోతే.. మళ్లీ మార్చుకునేందుకు కూడా వీలు లేకుండా పోతుందని, సో.. ఇలాంటి విషయాన్ని రాష్ట్రంతో అనుబంధం ఉన్న అధికారులకు ఇవ్వకుండా.. సీఎం జగన్ రిటైర్డ్ సీఎస్ (ప్రస్తుతం పదవీ కాలం పొడిగించారు) నీలం సాహ్నికి అప్పగించడం ఎందుకని ప్రశ్నలు వస్తున్నాయి.నీలం సాహ్నికి ఏపీ సామాజిక పరిస్థితులు, నైసర్గిక స్వరూపంపైనా ఎలాంటి అవగాహన లేనప్పుడు జిల్లాలకు సంబంధించి ఆమెతో కమిటీ వేయడం అంటే.. గతాన్ని గుర్తుకు తెస్తున్నట్టే ఉందని చెబుతున్నారు. ఇందులో అధికార పార్టీ నేతలతో పాటు అన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతోనూ, మీడియా వాళ్లతో పాటు పలు సామాజిక వేత్తలతో కమిటీ వేసి వీరి అభిప్రాయాలను తీసుకుని, అక్కడ ప్రజల సెంటిమెంట్, భౌగోళిక, నైసర్గిక పరిస్థితుల ఆధారంగా జిల్లాలను విభజించాల్సి ఉంటుందని.. మరీ ఇక్కడ సాహ్నికి కీలక బాధ్యతలు అప్పగించడంపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. మరి జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారో లేదో చూడాలి.