హైద్రాబాద్, జూలై 24,
కరోనా వైరస్ అనేక రంగాలను కుదిపేసింది. వ్యాపారాలను దెబ్బతీసింది. మరో ఏడాది పాటు కోలుకోలేని పరిస్థితులకు వచ్చాయి. ప్రధానంగా నగరాల్లో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లాక్ డౌన్ మినహాయింపులు ఇచ్చినా ప్రజలు షాపుల గడప ఎక్కేందుకు వెనకడుగు వేస్తున్నారు. నిత్యవసరాలు తప్ప ఇప్పుడు ప్రజలకు ఏమీ అవసరంగా కనపడటం లేదు. అందుకే అనేక వ్యాపారాలు మూతబడే స్థితికి వచ్చాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే వ్యాపారాన్ని మూసివేస్లున్నట్లు ప్రకటించాయి.హైదరాబాద్ నగరంలో అనేక కూడళ్లు ఉన్నాయి. ఒకప్పుడు కోఠి, అబిడ్స్ ప్రాంతాలకే పరిమితమైన వ్యాపారాలను హైదరాబాద్ లోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. ఒకప్పుడు షాపింగ్ కోసం కోఠి, అబిడ్స్ వైపు చూసే వాళ్లకి ఆ అవసరమే లేదు. ప్రతి సెంటర్ లో మాల్స్ వచ్చేశాయి. అన్ని రకాల షాపింగ్ కాంప్లెక్స్ లు వచ్చాయి. ప్రతి దుకాణం హైదరాబాద్ లోని నలుమూలలా బ్రాంచీలను ఓపెన్ చేసేసింది. వినియోగదారులకు చేరువయ్యేందుకు వ్యాపారంలో ఇది టెక్నిక్ కావడంతో అన్ని చోట్ల షాపులు వచ్చేశాయి.ఉదాహరణకు బాటా, ఆర్ఎస్ బ్రదర్స్, వెస్ట్ సైడ్, బ్రాండ్ ఫ్యాక్టరీ వంటి సంస్థలకు నగరంలో పదికి పైగానే బ్రాంచీలు ఉన్నాయి. ఇక బంగారు వ్యాపార దుకణాల సంగతి చెప్పనక్కరలేదు. అయితే కరోనా కారణంగా ఇప్పుడు వ్యాపారాలు పూర్తిగా మూతబడ్డాయి. ఉద్యోగుల జీతాలకే దిక్కులేకుండా పోతుంది. ఇక భవనాల అద్దె నిర్వహణ కూడా కష్టంగా మారింది. దీంతో ఇప్పుడు బ్రాంచీ కార్యాలయాలను ఎత్తివేసే పనిలో పడ్డాయి కొన్ని సంస్థలు.కొన్ని సంస్థలు తమ కస్టమర్లకు మెసేజ్ రూపంలో ఈ సమాచారాన్ని చేరవేస్తున్నాయి. మీ సమీపంలోని సంస్థను ఎత్తివేస్తున్నామని, దగ్గరలో ఉన్న తమ వ్యాపార సముదాయానికి వెళ్లవచ్చన్న మెసేజ్ లు వస్తున్నాయి. ఇలా పెద్ద పెద్ద సంస్థలే కరోనా ధాటికి విలవిల లాడుతున్నాయి. ఇక హోటళ్లు అయితే కేవలం టేక్ అవే వరకే పరిమితమయ్యాయి. హోటళ్లకు రావడం జనం తగ్గించడంతో అవి కూడా నష్టాల బాటలో నడుస్తున్నాయి. మొత్తం మీద కరోనా దెబ్బకు వ్యాపార సంస్థలు మూసివేత దిశగా పయనిస్తున్నాయి