హైద్రాబాద్, జూలై 24,
తెలంగాణలో ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. తొలిసారిగా రాష్ట్రంలో కమ్యూనిటీ వైరస్ అనుపానులు కనబడటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జ్వరంతో సహా అనారోగ్య సమస్యలు ఎదురైన వెంటనే చికిత్స చేయించుకోకపోతే తర్వాత ఏం చేసినా ఫలితం ఉండదని ప్రజలను హెచ్చరించింది.
జలుబు, దగ్గు, జ్వరంలాంటి అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోండి. తక్షణమే గుర్తించడం, వెంటనే చికిత్స పొందడం ద్వారానే కరోనా నుంచి బయట పడగలం. తీవ్రత పెరిగితే ఆ తరువాత ఏం చేసినా ఫలితం ఉండదు’ అని వైద్యశాఖ సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు‘కరోనా వైరస్' కమ్యూనిటీలోకి వెళ్లింది. ఎక్కడుందో, ఎలా సోకుతుందో పసిగట్టడం కష్టం. కంటికి కనిపించని ఈ వైరస్ పట్ల జాగ్రత్తలు పాటించడం తప్ప మరో మార్గం లేదు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నరు. కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే రోజుల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా మరణాలు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని, ఇందులోనూ దీర్ఘకాలిక సమస్యలతో చనిపోయే వారే అధికంగా ఉన్నా రన్నారు. అయితే కరోనా వైరస్‌కు భయపడవద్దని, జాగ్రత్తలు పాటించి సహజీవనం చేయడమొక్కటే మన ముందున్న మార్గమన్నారు. ఈ వైరస్ ప్రభావం ఎన్నిరోజులుంటుందో ప్రస్తుతం చెప్పడం కష్టమన్నారు. రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలను పెంచుతున్నామని, ఇటీవల రెండు లక్షల కిట్లు తెప్పించగా వాటితో పరీక్షలు చేశామని, మరో రెండు లక్షల కిట్లు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే నాలుగైదు వారాలు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోబోతున్నామని డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మూడు సూత్రాలను పాటించాలని సూచించారు. మాస్కులు ధరించడం, ఆరడుగుల భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం.. ఇవి తప్పక ఆచరించాలన్నారు. హైదరాబాద్‌లో కేసుల తీవ్రత అధికంగా ఉందని, దీంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని, కొత్త జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా చికిత్సను మరింత విస్తృతం చేశామన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షలు చేస్తున్నామన్నారు.