విజయవాడ, జూలై 24,
పంచంలో ఎప్పుడు ధరలు తగ్గినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గవు. ఒకవేళ ప్రతిరోజూ జరిగే ధరల సమీక్షలో 10-15 పైసలే తగ్గుతాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం పన్నులు పెంచేసి సామాన్యుల నడ్డి విరుస్తాయి. ఒకవైపు కరోనా భయం.. మరో వైపు డీజిల్ బాదుడుతో సామాన్యులు హడలిపోతున్నారు. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర ఎక్కువవుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్ ధరలను స్థిరంగా ఉంచిన చమురు కంపెనీలు, డీజిల్ ధరను పెంచేశాయి. కరోనా వేళ చమురుధరల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను సవరించింది. పెట్రోల్‌పై రూ. 1.24, డీజీల్‌పై రూ. 0.93 పైసల చొప్పున వ్యాట్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ వ్యాట్ చట్టం 2005ను సవరిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనితో పెట్రోల్‌పై 31 శాతం పన్నుతో పాటు రూ. 4 అదనంగా సుంకాన్ని, అలాగే డీజీల్‌పై 22 శాతం వ్యాట్‌తో పాటు రూ. 4 అదనంగా సుంకాన్ని పెంచేయడం విమర్శల పాలవుతోంది. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోవడంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.సుమారు రూ. 4480 కోట్ల మేర రావాల్సిన రెవన్యూ ప్రస్తుతం రూ. 1323 కోట్లు మాత్రమే వస్తోందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీరుని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో టీడీపీ ప్రభుత్వం ధరలు పెంచితే నానా యాగీ చేసిన జగన్ ఇప్పుడు సుంకాలు ఎలా పెంచారని మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ దుయ్యబట్టారు.కరోనా సమయంలో విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచి పేద ప్రజల కష్టాన్ని దోచుకున్నారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు లీటర్ పెట్రోల్, డీజిల్ పై భారీగా భారం మోపారన్నారు నారా లోకేష్. దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం ధరలు భారీగా పెంచి మద్యనిషేధం అన్న మేధావి కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమో! అంటూ సెటైర్లు పేల్చారు లోకేష్. ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు గురువారం నిలకడగానే కొనసాగాయి. దీంతో హైదరాబాద్‌లో గురువారం లీటరు పెట్రోల్ ధర రూ.83.49 వద్ద నిలకడగానే ఉంది. డీజిల్ ధర కూడా రూ.79.85 గా వుంది. అమరావతిలో కూడా పెట్రోల్ ధర రూ.83.96 వుండగా, డీజిల్ ధర రూ.80.01 వద్ద నిలకడగా వుంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.83.43 వద్దనే ఉంది. డీజిల్ ధర రూ.79.73 వద్ద నిలకడగా కొనసాగుతోంది.దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.80.43 వుండగా.. డీజిల్ ధర రూ.81.64కి చేరింది. పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉండడం విశేషం.