తిరుమల, జూలై 24,
తిరుమలలో ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు వచ్చేవారు ఒకప్పుడు. కానీ కరోనా ప్రభావంతో రెండునెలలకు పైగా భక్తుల దర్శనానికి అనుమతించలేదు. గత నెల నుంచి వివిధ జాగ్రత్తల మధ్య భక్తుల రాక మొదలైంది. కానీ రాను రాను తిరుమల, తిరుపతి ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోవడంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య దారుణంగా పడిపోతోంది. ప్రతి రోజు స్వామివారి దర్శనానికి 12 వేల మంది భక్తులను ఆనుమతించినా అందులో సగం కూడా రావడంలేదంటున్నారు టీటీడీ అధికారులు.
అదే విధంగా పూర్తిగా తగ్గిపోయింది విఐపి భక్తుల సంఖ్య. 60 ఏళ్ల నాటి పరిస్థితులు పునరావృతం అయ్యాయంటున్నాయి టిటిడి వర్గాలు. తిరుమల మాఢ వీధులు, వసతి గృహాలు ఖాళీగా వుంటున్నాయి. రాష్టంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ భారీగా తగ్గింది. అలిపిరి చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు, కోవిడ్ టెస్టులు కూడా చేస్తున్నారు. రెడ్ జోన్ల నుంచి తిరుమలకు వచ్చేవారికి నో ఎంట్రీ అని టీటీడీ ప్రకటించడంతో భక్తులు వెళ్లడం మానేశారు.
టీటీడీ తిరుమలలో శానిటైజ్ చేస్తోంది. గతంలో కంటే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య 30 శాతం తగ్గిందని టీటీడీయే ప్రకటించింది. ఎందుకొచ్చిన రిస్క్ అని భక్తులే రావడం మానేశారు. దీంతో నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమల భక్తుల లేక బోసిపోతోంది. నెలరోజుల్లో తిరుమలను దర్శించుకున్న భక్తుల సంఖ్య రెండున్నర లక్షలమంది మాత్రమే దర్శనం చేసుకున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. తిరుమల ఆలయానికి ఆదాయం కూడా భారీగా తగ్గిపోయింది.